అంతర్గత యుద్ధాలతో రగులుతున్న అఫ్గానిస్థాన్‌పై అమెరికా సైనిక చర్యలకు ఇకపై తమ దేశం వేదిక కాబోదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. గతంలో మాదిరి అమెరికా సైనిక స్థావరాలకు తాము చోటిస్తే పాక్‌పై ఉగ్రవాదుల ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉంటుందన్నారు. అఫ్గాన్ అగ్ర నేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ వారంలో సమావేశం ఏర్పాటుచేయనున్న నేపథ్యంలో 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రిక కోసం రాసిన వ్యాసంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజమదే..!
పాకిస్థాన్‌లో అమెరికా ఏర్పాటు చేయదలచిన స్థావరాల సామర్థ్యాన్ని కూడా ఇమ్రాన్‌ఖాన్ ప్రశ్నించారు. 'ఇప్పటికే మేము చాలా మూల్యం చెల్లించాం. ఇక భరించలేమ'ని స్పష్టంచేశారు. సెస్టెంబర్ దాడులు జరిగినపుడు అఫ్గాన్‌పై సైనిక చర్యల కోసం అమెరికాకు స్థావరంగా మారిన పాకిస్థాన్ ఇప్పుడు భిన్నమైన వైఖరి అవలంబించడంపై ఆయన వివరణ ఇస్తూ.. 'పాక్ నుంచి అఫ్గాన్‌పై బాంబులు విసిరితే అక్కడున్న ఉగ్రవాదులు తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటారన్నారు. ఎంతో బలమైన బలగమున్న ఐరాస.. అఫ్గాన్‌లో 20 ఏళ్లు ప్రయత్నించి కూడా విజయం సాధించలేకపోయింది. మాదేశం నుంచి పోరాడే అమెరికాకు అది ఎలా సాధ్యమవుతుంది?' అని ఇమ్రాన్‌ఖాన్ ప్రశ్నించారు. మేము ఏ ఒక్క వర్గానికీ అనుకూలం కాదు. అఫ్గాన్ ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ ప్రభుత్వంతోనైనా కలిసి పనిచేస్తాం. అఫ్గానిస్థాన్‌ను బయటి శక్తులు నియంత్రించలేవు చరిత్ర చెబుతున్న నిజమిదే అని తెలిపారు.
'అమెరికా సాయం అంతంతే..'
అఫ్గాన్ యుద్ధాలతో పాక్ ఇప్పటికే ఎంతో నష్టపోయిందని ఇమ్రాన్ చెప్పారు. "70 వేల మంది పాకిస్థానీయులు చనిపోయారు. అమెరికా 20 బిలియన్ డాలర్ల సాయం చేసింది. పాకిస్థాన్ ఆర్థికవ్యవస్థకు 150 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది" అని వివరించారు. 'గతంలో అమెరికాతో చేతులు కలిపిన కారణంగా పర్యటకరంగం, పెట్టుబడుల పరంగా కూడా నష్టం జరిగింది. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ వంటి పలు ఉగ్రవాద సంస్థలు మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నాయి' అన్నారు. తాలిబన్‌ను చర్చల దాకా తీసుకువచ్చేందుకు తాము చాలా ప్రయత్నం చేశామని, అఫ్గాన్ ప్రభుత్వం కూడా పాక్‌ను తప్పు పట్టడం మాని.. పట్టువిడుపు ధోరణి చూపాలని ఇమ్రాన్‌ఖాన్ కోరారు.
ఇవీ చదవండి: అఫ్గాన్ ఘర్షణల్లో 59 మంది మృతి