కరోనా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టేందుకు వెనుకాడేది లేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలను ప్రజలు ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపింది. దేశంలో మరణాల రేటు గత కొద్దివారాలతో పోలిస్తే 140 శాతం పెరిగినందున లాక్డౌన్ విధించడం తప్ప ఇంకో మార్గం లేదని పాకిస్థాన్ నేషనల్ కమాండ్, ఆపరేషన్స్ సెంటర్ హెచ్చరించింది.
"పరిస్థితులను ఎన్సీఓసీ నిశితంగా పరిశీలిస్తోంది. మార్గదర్శకాలు పాటించడంలో ఎలాంటి పురోగతి లేకుంటే కార్యకలాపాలు అన్నీ మూతపడేలా గట్టి చర్యలు తీసుకోవడం తప్ప ఎన్సీఓసీకి ఇంకో మార్గం లేదు."
-ఎన్సీఓసీ
దేశంలో కరోనా మరణాల సంఖ్య పెరుగుతోందని ఎన్సీఓసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.
140 శాతం పెరుగుదల
దేశంలో మరణాల రేటు 140 శాతం పెరిగిందని ప్రణాళిక మంత్రి అసద్ ఉమర్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
"గతవారం రోజువారీ కరోనా మరణాల సంఖ్య 12. కొన్ని వారాల ముందుతో పోలిస్తే ఇది 140 శాతం అధికం. అన్ని మార్గదర్శకాలను విస్మరించి మనమంతా తప్పు చేస్తున్నాం. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ మార్గాన్ని మనం వదిలేయకపోతే జీవితాలు, జీవనోపాధి రెండింటినీ కోల్పోతాం."
-అసద్ ఉమర్, ప్రణాళిక శాాఖ మంత్రి
ఇమ్రాన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనూ కేసుల పెరుగుదలపై చర్చ జరిగింది. వైరస్ విజృంభణపై మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా రెండో వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరింది.
పాకిస్థాన్ వైద్య శాఖ గణాంకాల ప్రకారం ఆ దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య 3,24,744కి చేరింది. కొత్తగా 19 మంది కరోనా కారణంగా మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 6,692కి చేరింది. 308,674 మంది పూర్తిగా కోలుకున్నారు. సింధ్, పంజాబ్ ప్రాంతంలోనే అధికంగా కేసులు బయటపడ్డాయి.
ఇదీ చదవండి- కోపమొచ్చి.. ఇంటర్వ్యూ మధ్యలోంచి వెళ్లిపోయిన ట్రంప్