చైనా నుంచి కొవిడ్-19 టీకాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది పాకిస్థాన్. ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థ సినోఫార్మా నుంచి.. 11 లక్షల డోసులు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌లో తమ టీకా 79.34 శాతం సామర్థవంతమైనది చైనా ప్రభుత్వం ప్రకటించిన ఒక్కరోజులోనే పాక్ కొనుగోలుకు మొగ్గు చూపడం గమనార్హం. చైనా టీకా కొనుగోలుపై కేబినెట్ కమిటీ ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.
మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర సురక్షితమైన టీకాల కొనుగోలు, పంపిణీ కోసం ప్రైవేట్ రంగం డ్రాప్‌ను సంప్రదించవచ్చని క్యాబినేట్ కమిటీ తెలిపింది. డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ (డ్రాప్) ఆధ్వర్యంలో ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ చేయనుంది పాక్. 2021 ప్రారంభంలో ఈ కార్యక్రమం మొదలవుతుందని పాక్ ప్రభుత్వం తెలిపింది.
పాక్‌లో కరోనా తీరిది..
గురువారం ఒక్కరోజే పాక్‌లో కొత్తగా 2,475 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 479,715 కు చేరుకుంది. గురువారం 4,960 మంది కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 435,073 కు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 10,105మంది మరణించారు.
ఇదీ చదవండి: 2021కి స్వాగతం పలికిన న్యూజిలాండ్