పాక్ చెరలో ఉన్న భారత నౌకాదళ విశ్రాంత ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. జాదవ్‌కు మరణ దండన ఆపాలనే ఐసీజే తీర్పును గౌరవిస్తున్నామని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
"కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విధించకూడదన్న ఐసీజే నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. పాకిస్థాన్ ప్రజలను ఆయన ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్థాన్ ఈ విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటుంది."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాన మంత్రి
'పాక్ ప్రజలను మభ్యపెట్టే చర్యే'
కుల్‌భూషణ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును పాటించటం మినహా పాక్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత వైఖరికి తగినట్టే తీర్పు వెలువడిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ప్రకటించారు.
"ఐసీజేలో నైతిక విజయం సాధించామన్న పాక్ ప్రకటన.. ఆ దేశ ప్రజలను మభ్యపెట్టే చర్యే. తీర్పును అమలు చేయటం పాక్‌కు తప్పనిసరి. ఐసీజే తీర్పే అంతిమం. అప్పీలుకు అవకాశం లేదు."
-రవీశ్ కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
కేసు వివరాలు..
తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారని 2016లో జాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పాక్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో విచారణ చేపట్టిన సైనిక న్యాయస్థానం.. గూఢచర్యం, ఉగ్రవాదానికి పాల్పడినట్లు పేర్కొంటూ 2017 ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 2017 మే 8న ఐసీజేను భారత్ ఆశ్రయించింది.
పాక్ ఆరోపణలను ఖండించిన భారత్... ఉద్యోగ విరమణ తర్వాత ఇరాన్లో వ్యాపారం చేస్తుండగా అపహరణకు గురయినట్లు ఐసీజేకు తెలిపింది. సుదీర్ఘ విచారణ తర్వాత ఎట్టకేలకు భారత్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. జాదవ్‌కు మరణ దండనపై పునః సమీక్షించాలని పాకిస్థాన్‌కు ఐసీజే స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఐసీజే తీర్పుపై భారత్ హర్షం.. విజయం తమదేనన్న పాక్