పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్‌ను.. బ్రిటన్ ప్రభుత్వం తమకు అప్పగించేందుకు కావాల్సిన న్యాయ ప్రక్రియను ప్రారంభించినట్లు ఆ దేశ సమాచార మంత్రి షిబ్లి ఫరాజ్ తెలిపారు. త్వరలోనే లండన్‌తో తగిన ఒప్పందం చేసుకుంటామని పేర్కొన్నారు. కోర్టుకు ఇచ్చిన మాట మేరకు ఆయన దేశానికి తిరిగి రాలేదు. దీంతో నవాబ్‌పై ఈ చర్యలకు సిద్ధమైనట్లు స్పష్టం చేశారు.
''దోషులను తమ దేశంలోకి రానివ్వకుండా బ్రిటన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. షరీఫ్‌పై 2018లోనే అవినీతి, మనీ లాండరింగ్ కింద కేసు నమోదైంది. అయినా ఆయనను అనుమతించింది. షరీఫ్‌ను వెనక్కి తీసుకురావడానికి కొంత కాలం నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇకపైనా ప్రయత్నాలు చేస్తాం. ప్రస్తుతానికైతే లండన్‌తో నేరస్థులను అప్పగించే ఒప్పందాలేవీ లేవు. దీనిపై యూకే నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. పార్లమెంట్‌లోనూ కొంత ఇబ్బంది తప్పదు.''
-షిబ్లి ఫరాజ్, పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి
అవినీతి, మనీ లాండరింగ్ కేసులో షరీఫ్ ఇప్పటికే ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. మరో కేసులోనూ ఆయన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఇస్లామాబాద్ హైకోర్టులో వాదనలు జరగాల్సి ఉంది. నవాబ్ ప్రస్తుతం లండన్‌లో ఉండటంతో దానిపైనా అనిశ్చితి నెలకొంది.
ఇదీ చూడండి: చికిత్స నిమిత్తం లండన్‌కు నవాజ్ షరీఫ్!