పౌరుల భావ వక్తీకరణ స్వేచ్ఛకు రక్షణలో పాకిస్థాన్ ఘోరంగా విఫలమైనట్లు మీడియా మ్యాటర్స్ ఫర్ డెమోక్రసీ తెలిపింది. పాకిస్థాన్ ప్రజాస్వామ్య వ్యక్తీకరణ నివేదిక-2020ను 'ది న్యూస్ ఇంటర్నేషనల్' విడుదల చేసింది. ఈ నివేదికకు ఆరు అంశాల్ని ప్రాతిపదికగా తీసుకోగా..మొత్తం 100 పాయింట్లకు పాక్ కేవలం 30 పాయింట్లే పొందింది.
నివేదిక పాకిస్థాన్‌లో జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను ప్రముఖంగా పేర్కొందని పాక్‌లోని ఐరోపా సమాఖ్య రాయబారి ఆండ్రూల్లా కమినారా తెలిపారు. పాకిస్థాన్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలా ఉందో ఈ నివేదిక తేటతెల్లం చేస్తోందని పేర్కొన్నారు.
2020లో మీడియాపై పాక్ ప్రభుత్వం విపరీత ఆంక్షలు విధించినట్లు నివేదిక తెలిపింది. చాలా డిజిటల్ మీడియాలపై నిషేధం విధించిందని.. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ, తదితర అంశాలపై మాట్లాడకుండా నియంత్రించిందని వెల్లడించింది.
పత్రికా స్వేచ్ఛలోనూ చెత్త రికార్డు
పత్రికా స్వేచ్ఛలోనూ పాక్ చెత్త రికార్డును నమోదు చేసింది. 2020 సంవత్సారనికి గానూ పత్రికా స్వేచ్ఛలో 180 దేశాల్లో పాక్ 145 స్థానానికి దిగజారిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్-2020 తెలిపింది. 2017 నుంచి వరుసగా పాక్ పత్రికా స్వేచ్ఛలో దిగజారుతూనే ఉందని వెల్లడించింది.
11మంది పాత్రికేయుల హత్య
పాక్‌లో జర్నలిస్టులపై దూషణలు, దాడులు, చిత్రహింసలు, హత్యలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని నివేదిక పేర్కొంది. గత ఐదు సంవత్సరాల్లో పాక్‌లో 11మంది పాత్రికేయుల్ని హత్య చేశారని .. అందులో ఏడుగురి హత్యలు ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయని ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ఇదీ చదవండి: పాక్‌లో హిందూ భక్తులను అడ్డుకున్న భద్రతా సిబ్బంది