Pakistan Lynching: మతపరమైన పుస్తకాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలతో పాకిస్థాన్లో ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు దుండగులు. మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. మృతుడి మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని ఓ కుగ్రామంలో జరిగిన ఈ ఘటనపై పాకిస్థాన్ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.
Quran Pakistan Lynching
శనివారం సాయంత్రం ప్రార్థనల కోసం జంగిల్ డేరావాలా గ్రామంలోని షాముఖీమ్ మౌజా మసీదు వద్ద స్థానికులు సమావేశమయ్యారు. ఈ సమయంలోనే.. ఓ వ్యక్తి మత గ్రంథం పేజీలను చించేశాడని, అనంతరం పుస్తకాన్ని మంటల్లో వేశాడని అనౌన్స్మెంట్లు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానీ, ఆందోళన చేస్తున్న స్థానికులు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల.. పోలీసులకు వారిని ఆపతరం కాలేదు.
స్టేషన్ హౌస్ అధికారి కస్టడీలో ఉన్న ఆ వ్యక్తిని.. ఆందోళనకారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. చెట్టుకు కట్టేసి తీవ్రంగా చితకబాదారు. అనంతరం, శరీరానికి ఉరివేసి చెట్టుకు వేలాడదీశారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో మసీదు వద్ద 300 మంది ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు 62 మందిని అరెస్టు చేశామని, మిగిలిన వారికోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు.
ఇదీ చదవండి: యెమెన్లో ఐదుగురు ఐక్యరాజ్య సమితి ఉద్యోగుల కిడ్నాప్