కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించి భంగపాటుకు గురైన పాకిస్థాన్... తాజాగా ఇదే విషయంపై తన మిత్రదేశం చైనాతో చర్చలు జరిపింది. కశ్మీర్ ప్రాంతంపై ఉన్న వివాదాలను పరస్పర గౌరవం, సమానత్వంతో కూడిన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. కశ్మీర్ సార్వభౌమత్యాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కృషి చేయనున్నట్టు పాక్‌కు చైనా హామీనిచ్చింది.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల పాకిస్థాన్ పర్యటన ముగిసిన అనంతరం అధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలపై ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావం చూపవని ఇరు దేశాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
రెండు రోజుల పర్యటనలో భాగంగా పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషితో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృత చర్చలు జరిపారు వాంగ్.
కశ్మీర్ అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తిన పాక్... వాంగ్‌కు తాజా పరిస్థితులను వివరించింది. ఐరాస భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి సూచించారు.
ఇదీ చూడండి:- పాపం పాకిస్థాన్..! యూనిసెఫ్లోనూ భంగపాటే