పాకిస్థాన్‌లోని ఉగ్రసంస్థలు జమాత్ ఉద్ దావా(జేయూడీ), ఫలా ఈ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్)కు చెందిన 56 భవనాలను అక్కడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు వాటి ఆధ్వర్యంలో నడుస్తున్న మసీదులు, మదర్సాలను సైతం జప్తు చేసింది.
దీనిపై సింధ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వాధీనం చేసుకున్న మదర్సాలు, మసీదులను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని తెలిపింది.
పాకిస్థాన్ జాతీయ ఉగ్రవాద నిరోధక సంస్థ(నాక్టా) జాబితాలోని 70 సంస్థలో జేయూడీ, ఎఫ్ఐఎఫ్ ప్రముఖమైనవి. వీటి కింద 50వేల మంది వలంటీర్లు, వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ రెండు సంస్థలు ఉగ్రవాద నిరోధక చట్టం-1997ను ఉల్లంఘించాయని ప్రభుత్వం పేర్కొంది.
జేయూడీ వ్యవస్థాపకుడు ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్. అమెరికా ప్రభుత్వం సయీద్‌ను 2012లోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, అతని తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. ఐరాస 1267 జాబితాలోనూ సయీద్ పేరును చేర్చారు.
పుల్వామా ఉగ్రదాడితో ప్రారంభమైన ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. ఫలితంగా దిద్దుబాటు చర్యలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉపక్రమించింది. ఇప్పటికే నాక్టా చట్టం కింద 70 ఉగ్రవాద సంస్థలను నిషేధించింది. సుమారు 44 మంది తీవ్రవాదులను అరెస్టు చేసింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కొడుకు, సోదరుడు సైతం ఉన్నారు.