భారత రక్షణ శాఖ 'అగ్ని-2'ను విజయవంతంగా ప్రయోగించిన నేపథ్యంలో.. బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది పాకిస్థాన్. భూ ఉపరితలం నుంచి 650 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణికి 'షహీన్-1'గా నామకరణం చేసింది. 'సైనిక వ్యూహాత్మక దళం (ఏఎస్ఎఫ్సీ)'పరీక్షల్లో భాగంగా ఈ ప్రయోగం చేసినట్లు పాక్ సైనిక మీడియా పేర్కొంది.
భారత్కు దీటుగా..!
భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'అగ్ని-2' ప్రయోగం విజయవంతమైన గంటల వ్యవధిలోనే.. పాక్ 'షహీన్-1'ను ప్రయోగించడం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాక్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేయడం సరికొత్త సందేహాలు రేకెత్తిస్తోంది.
అగ్ని-2 ప్రయోగం విజయవంతం
వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని-2'ను తొలిసారి రాత్రివేళ విజయవంతంగా ప్రయోగించింది భారత రక్షణ శాఖ. ఉపరితలం నుంచి 2 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశా బాలాసోర్లోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి శనివారం రాత్రి ప్రయోగించింది.