ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు 1.82 కోట్ల మందికి వైరస్ సోకగా.. 6,93,154 మంది మరణించారు. వైరస్ బారి నుంచి 1.14 కోట్ల మంది కోలుకున్నారు.
కఠిన నిబంధనలతో కరోనాను అదుపులోకి తెచ్చిన దేశాల్లోనూ వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. ఫ్రాన్స్‌లో వారం రోజుల్లో 7 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా వందల కొద్దీ సమూహాల్లో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. ఇప్పటివరకు ఫ్రాన్స్‌లో వైరస్ బారిన పడి 30,265 మంది చనిపోయారు.
ఈ నేపథ్యంలో మాస్కు నిబంధనలను కఠినతరం చేసింది అక్కడి ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లోనూ మాస్కు వినియోగం తప్పనిసరి చేశారు.
లాక్డౌన్ ఎత్తివేత..
పాక్‌లో వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 330 కేసులు నమోదైనట్లు పాక్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 14 తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావటం ఇదే మొదటిసారి.
పాక్‌లో ఇప్పటివరకు మొత్తం 2.8 లక్షల మందికి సోకగా... 5,984 మంది మృతి చెందారు. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
అమెరికాలో..
అమెరికాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నా పాఠశాలల పునఃప్రారంభం కానుండటం ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. వచ్చే వారం నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల ఉద్యోగులు ఈ వారమే విధులకు హాజరుకావాల్సి ఉంది.
అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 48.13 లక్షల కేసులు నమోదయ్యాయి. 1.58 లక్షల మంది చనిపోయారు.
ఫిలిప్పీన్స్‌లో లాక్డౌన్..
ఫిలిప్పీన్స్‌లో కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఫిలిప్పీన్స్‌లో కొత్తగా రికార్డు స్థాయిలో 5 వేల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. కరోనా ధాటికి 2 వేల మంది చనిపోయారు.
ఈ నేపథ్యంలో ఆ దేశ రాజధాని మనీలాతో పాటు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. తొలుత జూన్ 1న లాక్డౌన్ సడలింపులు ఇచ్చారు. అయితే మళ్లీ కేసలు విజృంభించగా తాజా నిర్ణయం తీసుకున్నారు.
సింగపూర్‌లో..
సింగపూర్‌లో కొత్తగా 226 కేసులు నమోదు కాగా మొత్తం సంఖ్య 53 వేలకు చేరింది. కొత్త కేసుల్లో వలస కార్మికులే అధికంగా ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. వాళ్లు నివసించే వసతి గృహాల్లోనే వ్యాప్తి అధికంగా ఉందని స్పష్టం చేసింది.