పాకిస్థాన్ ప్రభుత్వం భారత వైమానిక దళ పైలెట్లపై అటవీశాఖ చేత ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. భారత్ చేసిన దాడిలో అటవీ ప్రాంతంలోని 19 చెట్లు నేలకూలాయని, ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించింది.
భారత్ చేసిన పర్యావరణ దాడిపై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేయాలని పాక్ భావిస్తోంది. ఐరాసతో పాటు ఇతర అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని ప్రస్తావించాలని కుయుక్తులు పన్నుతోంది.
"భారత యుద్ధ విమానాలు పాకిస్థాన్‌లోని అటవీ ప్రాంతంపై బాంబు దాడి చేశాయి. డజన్ల కొద్దీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లింది. దీనిపై మేము ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తాం. ఇతర అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తాం."- మాలిక్ అమిన్ అస్లామ్, పాకిస్థాన్ పర్యావరణశాఖ మంత్రి
ఊసరవెల్లి పాక్...
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో గల బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడి చేసి వాటిని నాశనం చేసింది. ఈ దాడిలో సుమారు 300 వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వాదనను పాక్ తోసిపుచ్చింది. బాలాకోట్‌లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని బుకాయించింది. తాజాగా ప్లేటు ఫిరాయించి భారత వైమానిక దాడిలో పర్యావరణానికి హాని కలిగిందని ఆరోపిస్తోంది.
ఐరాస నిబంధనలు ఏం చెబుతున్నాయి...
ఐక్యరాజ్యసమితి నిబంధన ప్రకారం, "సైనిక చర్య అనివార్యత పేరుతో పర్యావరణానికి నష్టం చేకూర్చకూడదు. ఇది అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం."- ఐక్యరాజ్య సమితి సాధారణ మండలి 47/37 నిబంధనలు