భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో మరోమారు చైనాకు వెళ్లనున్నారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు బీజింగ్ చేరుకోనున్నారు.
ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో పాటు ఆ దేశ ఉన్నత స్థాయి నాయకత్వంతో భేటీ కానున్నారు ఇమ్రాన్. ఇందులో ప్రధానంగా ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు చైనా అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి చైనాలో పర్యటిస్తున్నారు ఖాన్.
భారత్-చైనా అధినేతల భేటీకి ముందు..
వచ్చే వారం భారత పర్యటనకు రానున్నారు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్. చెన్నై సమీపంలోని మామల్లపురంలో జరిగే ఓ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అనధికారికంగా భేటీ కానున్నారు జిన్‌పింగ్. భారత్-చైనా అధినేతల భేటీకి ముందు పాక్ ప్రధాని చైనా పర్యటన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు విషయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచింది చైనా. భారత్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం సరికాదని పేర్కొన్నారు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ.
ఇదీ చూడండి: మోదీ- జిన్‌పింగ్ భేటీతో అనుమానాల తెరలు తొలిగేనా?