కరోనా.. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న భయంకర వైరస్. డ్రాగన్ దేశంలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 213కు చేరింది. తాజాగా మరింత మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వైరస్ బారిన పడినవారి సంఖ్య 9,692కు చేరినట్లు వెల్లడించారు.
పాక్ వింత వైఖరి..
కరోనా భయంతో ప్రపంచ దేశాలన్నీ డ్రాగన్ దేశంలోని తమ దేశస్థులు, విద్యార్థులను తిరిగి రప్పించేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. వూహాన్లో ఉంటున్న పాకిస్థానీలు ఎవరు ఖాళీ చేయనవసరం లేదని తెలిపింది. తమ మిత్ర దేశానికి సంఘీభావం తెలపటం కోసం ఈ నిర్ణయం తీసుకుంది ఇమ్రాన్ సర్కార్. ప్రస్తుతం చైనాలో 800 మంది పాక్ విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే నలుగురు పాక్ దేశస్థులు కరోనా బారిన పడ్డారు.
హుబే రాష్ట్రంలోనే 204 మంది..
చైనాలోని హుబే రాష్ట్రంలోనే మొత్తం 5,806 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 204 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్తో కలిపి 20 దేశాల్లో కరోనా కేసులు నమోదైనట్లు ప్రకటించాయి.
ఇదిలా ఉండగా చైనాలోని భారతీయులకు తీసుకొచ్చేందుకు ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు దిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానం వెళ్లనుంది.
అత్యవసర పరిస్థితి విధింపు..
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సమావేశమైంది. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలున్న దేశాలకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశముందని... ఈ విషయం ఆందోళన కలిగిస్తున్నందున అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించామని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'జైలుకు వెళ్లకపోతే.. రాజకీయ నాయకుడివి ఎలా అవుతావు'