సిక్కు గురువు మహారాజా రంజీత్ సింగ్ వర్ధంతి నేపథ్యంలో సోమవారం నుంచి కర్తార్‌పుర్ కారిడార్ పునఃప్రారంభించేందుకు సిద్ధమని పాకిస్థాన్.. భారత్‌కు తెలియజేసింది. కరోనా మహమ్మారి వల్ల మూడు నెలల క్రితం తాత్కాలికంగా మూతపడిన ఈ రహదారిని తిరిగి ప్రారంభించనున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
''ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు, మత ప్రదేశాలు క్రమంగా తెరుచుకుంటున్న క్రమంలో పాకిస్థాన్ సైతం కర్తార్‌పుర్ ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టింది. వైద్య మార్గదర్శకాలను అనుసరించి కర్తార్‌పుర్ తిరిగి ప్రారంభించడానికి కావాల్సిన ఎస్ఓపీల(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)ను తయారు చేయడానికి భారత్‌ను పాకిస్థాన్ ఆహ్వానించింది.''
-పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకోవడానికి అవసరమైన రిజిస్ట్రేషన్లను మార్చి 16న భారత్ నిలిపివేసింది.
భక్తుల కోసం..
సిక్కుల సందర్శనార్థం పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్ నుంచి భారత్‌లోని గురుదాస్‌పుర్ వరకు కారిడార్‌ను ఇరుదేశాలు కలిసి నిర్మించాయి. గతేడాది నవంబర్‌లో ఈ కారిడార్‌ను ప్రారంభించాయి. పాక్‌లోని నరోవాల్ జిల్లా రావి నది సమీపంలో కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారా ఉంది. డేరాబాబా నానక్ నుంచి ఈ ప్రాంతం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తన జీవిత చరమాంకాన్ని కర్తార్పుర్లోనే గడిపినట్లు భక్తులు విశ్వసిస్తారు. 18 ఏళ్ల పాటు గురునానక్ ఈ ప్రాంతంలో జీవించారు. భారత్‌లోని అన్ని మతాల ప్రజలకు ఈ చారిత్రక గురుద్వారాను సందర్శించుకోవడానికి అనుమతి ఉంటుంది.
ఇదీ చదవండి- టాయిలెట్ డిజైన్ చెప్పండి.. రూ.15 లక్షలు గెలుచుకోండి!