పుల్వమా ఉగ్రదాడి అనంతరం పాక్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చూడాలని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిషేధించాలని వివిధ దేశాలు హెచ్చరించాయి. ఫలితంగా, ఫిబ్రవరి 21న జమాత్ ఉద్ దావా, ఫలాహే ఇన్సానియాత్ ఫౌండేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది పాక్. కానీ ఇప్పటి వరకు వాటిపై చర్యలు చేపట్టలేదు.
ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని ఈ సంస్థలపై నిషేధం విధించకుండా జాప్యం చేస్తోంది పాక్. నేటికీ వాటిని పర్యవేక్షణ సంస్థల జాబితాలోనే కొనసాగిస్తోంది.
పాకిస్థాన్ జాతీయ తీవ్రవాద వ్యతిరేక సంస్థ (ఎన్సీటీఏ) వెబ్సైట్ ప్రకారం హోంశాఖ పరిధిలోని తీవ్రవాద నిర్మూలన చట్టం 1997 ప్రకారం పర్యవేక్షణ సంస్థల జాబితాలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్తుల జప్తునకు ఆదేశాలు
పలు దేశాల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న పాక్ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. నిషేధిత జాబితాలోని సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు అమలు చేసేందుకు వీలుగా పాకిస్థాన్ సంకల్పించింది. దేశంలోని అన్ని నిషేధిత సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి చట్టాన్ని తీసుకొచ్చింది.
ఐరాస భద్రతా మండలి ఆస్తుల స్వాధీన ఆదేశాలు-2019 జారీ చేసినట్లు విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు.