కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సంప్రదింపుల్లో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. మండలిలో చైనా మినహా ఏ దేశమూ అండగా నిలవలేదని పాక్ పత్రికలే కుండబద్దలు కొట్టాయి. కానీ భేటీ తర్వాత ఐరాసలో పాక్ రాయబారి మాట్లాడుతూ.. విజయం సాధించామని బూటకపు వ్యాఖ్యలు చేసింది.
"కశ్మీర్ ప్రజల గొంతును అంతర్జాతీయ అత్యున్నత సంస్థలో వినిపించగలిగాం. వాళ్లు ఒంటరి కాదు. భద్రతా మండలిలో వాళ్ల వేదన, పరిస్థితిని వివరించాం. జమ్ము కశ్మీర్ వివాదంలో శాంతియుత పరిష్కారానికి మా దేశం కట్టుబడి ఉంది. ఈ సమావేశంలో కశ్మీర్ తమ అంతర్గతమని చెబుతున్న భారత్ వాదనను ఎవరూ సమర్థించలేదు. ఇప్పుడు కశ్మీర్, అక్కడి పరిస్థితి గురించి ప్రపంచం చర్చిస్తోంది."
-మలీహా లోధి, ఐరాసలో పాక్ రాయబారి
కశ్మీర్ అంశంపై ఐరాస భద్రతా మండలి జరిపిన రహస్య సమావేశం ఎలాంటి ఫలితంగా లేకుండానే ముగిసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్ తమ దేశ అంతర్గత విషయమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇందులో ఇతరులు (పాక్) కలుగజేసుకునే అవకాశం లేదని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ ఉగ్రకార్యకలాపాలు ఆపాలని భారత్ హితవు పలికింది.
ఇదీ చూడండి: 'కశ్మీర్ మా అంతర్గత విషయం..పాక్ జోక్యం అనవసరం'