ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారికి కేంద్రబిందువు చైనాలోని వుహాన్. ఇప్పుడు ఆ ప్రాంతం ప్రాణాంతక వైరస్ నుంచి దాదాపు కోలుకుంది. వరుసగా రెండోరోజూ వుహాన్లో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది.
చైనావ్యాప్తంగా మంగళవారం 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 11మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 3,237కు చేరుకుంది. అయితే కరోనా ప్రభావం అధికంగా ఉన్న హుబే రాష్ట్రంలో మాత్రం గత 13రోజులుగా వుహాన్ మినహా మరెక్కడా పాజిటివ్ కేసులు నమోదుకాకపోవడం చైనాకు ఊరటనిస్తోంది.
వైరస్ వ్యాప్తి తగ్గన నేపథ్యంలో హుబేలో నియమించిన వేలాది మంది వైద్య సిబ్బందిని ఉపసంహరించుకుంటోంది ప్రభుత్వం. ఇటీవలే 14 తాత్కాలిక ఆస్పత్రులను ధ్వంసం చేసింది.
చైనాలో ఇప్పటివరకు 80వేల 894మందికి కరోనా సోకింది. వీరిలో 69వేల601మంది చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క హుబే రాష్ట్రంలోనే 67వేల 800కేసులు నమోదయ్యాయి.
కరోనా వ్యాప్తి నియంత్రణకు హుబే రాష్ట్రాన్ని జనవరి 23న మూసివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో త్వరలోనే పరిశ్రమలు, వ్యాపారాలను పునరుద్ధరించాలని భావిస్తోంది చైనా ప్రభుత్వం.