Omicron not finding in tests: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ విస్తృత వ్యాప్తితో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యాధి తీవ్రతపై ఇప్పటివరకు స్పష్టత లేనప్పటికీ వైరస్ సంక్రమణ అధికంగా ఉన్నట్లు తేలడంతో దేశాలన్నీ కలవరపడుతున్నాయి. ఇదే ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా దీన్ని ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించింది. ఇదే సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ జన్యువులో మరిన్ని మార్పులకు గురైనట్లు తాజాగా ఆస్ట్రేలియా నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా నిర్ధరణ పరీక్షల్లో గుర్తించలేని ఒమిక్రాన్ తరహా రకాన్ని కనుగొన్నామని క్వీన్స్‌లాండ్ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. అయితే, ఇది ఒమిక్రాన్‌లో కొత్త వేరియంట్ మాత్రం కాదని స్పష్టం చేశారు.
Omicron Australia version:
నాలుగు రోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి క్వీన్స్‌లాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆ ఫలితాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా ఒక దానిలో వాస్తవ వేరియంట్‌తో పోలిస్తే అందులోని జన్యువులో వైవిధ్యాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సాధారణ పరీక్షల్లోనూ దీన్ని గుర్తించే వీలు కలగడంలేదని క్వీన్స్‌లాండ్ ఆరోగ్యశాఖ అధికారి పీటర్ ఐట్‌కెన్ పేర్కొన్నారు. దీనికి ఒమిక్రాన్‌గా వర్గీకరించేందుకు అవసరమైన సూచికలను కలిగి వుందన్న ఆయన.. వ్యాధి తీవ్రత, వ్యాక్సిన్‌ల ప్రభావంపై మాత్రం ఇప్పటివరకు తగినతం సమాచారం లేదని వెల్లడించారు.
Omicron testing news
ప్రమాదకారిగా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రాకముందే.. ఈ వేరియంట్ తరహా మరో కొత్త వైరస్ గుర్తించడం శాస్త్రవేత్తలకు మరో సవాలుగా మారింది. ఇప్పటికే నిర్ధారించిన ఒమిక్రాన్‌తో పోలిస్తే తాజాగా గుర్తించిన ఒమిక్రాన్ తరహా వేరియంట్‌లో 14 మ్యుటేషన్లు జరిగినట్లు క్వీన్స్‌లాండ్ నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే, ఇందులో ఎస్-జీన్ డ్రాపౌట్ ఫీచర్ లేకపోవడం వల్ల పీసీఆర్ పరీక్షల్లో గుర్తించడం కష్టంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, వైరస్‌లు మ్యుటేషన్లకు గురౌతున్న సమయంలో జన్యువులో కలిగే మార్పులు హానికరం కాకపోవచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. వాటిలో కొన్ని మాత్రమే యాంటీబాడీల నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి వుంటాయని గుర్తుచేస్తున్నారు. తాజాగా బయటపడిన ఈ విషయం వల్ల వివిధ సమూహాల్లో ఒమిక్రాన్ ప్రాబల్యాన్ని గుర్తించడంలో ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
Omicron new variant:
ఇదిలాఉంటే, క్వీన్స్‌లాండ్‌లో ఇప్పటికే 80శాతం అర్హులకు పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించారు. దీంతో అక్కడ విధించిన కొవిడ్ ఆంక్షలను పూర్తి స్థాయిలో ఎత్తివేసేందుకు నగర అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే తాజాగా రెండు ఒమిక్రాన్ తరహా కేసులు బయటపడడంతో ఆస్ట్రేలియా అధికారుల్లో మళ్లీ కలవరం మొదలయ్యింది.
ఇదీ చదవండి: 57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. డబ్ల్యూహెచ్ఓ హై అలర్ట్