నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పుష్పకుమార్ దహాల్ ప్రచండతో తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కీలకమైన స్టాండింగ్ కమిటీ సమావేశానికి ప్రధాని కేపీ శర్మ ఓలి గైర్హాజరయ్యారు. తాను సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు ఓలి లేఖ పంపించారని ఎన్సీపీ ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. డిసెంబర్ 13న తర్వాతి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
తనపై ఆరోపణలు చేస్తూ ప్రచండ ప్రవేశపెట్టిన రాజకీయ పత్రాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేఖలో ఓలి డిమాండ్ చేశారు. పార్టీని తిరిగి ఐక్యం చేసేందుకు స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలని, త్వరలో జరగనున్న పార్టీ జనరల్ కన్వెన్షన్‌కు సిద్ధం కావాలని సూచించారు. తొలి జనరల్ కన్వెన్షన్‌లో పార్టీ నాయకత్వ మార్పుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
"ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీ అంతర్గత సంక్షోభం చర్చల ద్వారా పరిష్కారం కావాలి. జనరల్ కన్వెన్షన్ నిర్వహణకు నాలుగు నెలలే ఉన్న నేపథ్యంలో పార్టీ ఐక్యంగా ఉండాలి. నాయకత్వ మార్పు అంశంపై జనరల్ కన్వెన్షన్‌లో పార్టీ పరిష్కరించుకోవచ్చు."
-ఓలి, నేపాల్ ప్రధాని, ఎన్సీపీ ఛైర్మన్
వివాదం మొదలైందిలా...
భారత్‌లోని పలు భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త మ్యాప్‌ను తీసుకొచ్చింది ఓలి ప్రభుత్వం. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర జరుగుతోందని భారత్‌పై ఆరోపణలు చేశారు ఓలి. ఆ తర్వాత.. అధికార పార్టీ నేతలు ప్రచండ, సీనియర్ సభ్యుడు మాధవ్ కుమార్ నేపాల్‌లు.. పార్టీ ఛైర్మన్ పదవి, ప్రధాని పదవికి ఓలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీని సంప్రదించకుండానే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఓలిపై ఆరోపణలు చేశారు.
మరోవైపు, వీటిని ఖండించిన ఓలి... అవినీతి ఆరోపణలను రుజువు చేయాలని, లేదంటే క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు. పార్టీ వ్యవహారాలు నిర్వహించేందుకు ప్రచండ సహకరించడం లేదని తిరిగి ఆరోపణలు చేశారు. దీంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. అప్పటి నుంచి ఓలి, ప్రచండల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
అప్పుడు కలిసి...
ఓలి సారథ్యంలోని సీపీఎన్-యూఎంఎల్, ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్టు) పార్టీలు కలిసి 2018 మేలో నేపాల్ కమ్యుూనిస్టు పార్టీగా రూపాంతరం చెందాయి. ప్రస్తుతం ఈ రెండు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. పార్టీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగమైన సెక్రెటేరియట్‌లో ప్రచండకు మెజారిటీ ఉంది.