Julie Anne Genter MP: నిండు గర్భిణీలు ఎక్కువసేపు నడిస్తేనే కంగారు పడుతుంటాము. వారికి శ్రమ లేకుండా ఉండేందుకు ఆసుపత్రికి ఏదైనా సౌకర్యవంతమైన వాహనంలో తీసుకెళ్తాం. కానీ ఓ మహిళా ఎంపీ సాహసమే చేశారు. పురుటి నొప్పులు వస్తున్నా ఆసుపత్రికి సైకిల్ మీదే వెళ్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఘటన మన దేశంలో కాదు.. న్యూజిలాండ్‌లో జరిగింది.
'అలా వెళ్తును అనుకోలేదు'
శనివారం అర్ధరాత్రి 2 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) గ్రీన్స్ పార్టీకి చెందిన న్యూజిలాండ్ ఎంపీ జూలీ అన్నే గెంటర్కు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె సైకిల్ మీద ఆసుపత్రికి బయలుదేరారు. 10 నిమిషాల్లో ఆసుపత్రికి చేరిన జూలీ.. గంట తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"బిగ్ న్యూస్! ఈరోజు తెల్లవారుజామున 3.04 గంటలకు మేము మా కుటుంబంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించాము. బేబీ ఆరోగ్యంగా ఉంది. నిజానికి పురుటి నొప్పులు వస్తున్న సమయంలో సైకిల్ తొక్కాలని నేను అనుకుకోలేదు. కానీ అలా జరిగిపోయింది. ఆసుపత్రికి బయలుదేరే సమయానికి నాకు పురుటి నొప్పులు అంత తీవ్రంగా లేవు. కానీ ఆసుపత్రికి చేరే సమయానికి ఎక్కువయ్యాయి."
-జూలీ అన్నే గెంటర్, ఎంపీ
ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఫేస్బుక్లో షేర్ చేశారు గెంటర్.
గెంటర్కు తన మొదటి కాన్పునకు కూడా ఇలాగే సైకిల్ మీద ఆసుపత్రికి వెళ్లడం విశేషం.
ఇదీ చూడండి : Omicron variant: కొవిడ్ కొత్త రకం గుట్టు తెలిసిందిలా..