అణ్వస్త్రాలను మోసుకెళ్లే హైపర్ సోనిక్ క్షిపణిని(North Korea missile test latest news) విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. మంగళవారం నిర్వహించిన తొలి పరీక్షలో(North Korea missile test ) నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలను క్షిపణి అందుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా క్షిపణి చిత్రాన్ని విడుదల చేసింది. తద్వారా అమెరికా, దక్షిణ కొరియాలపై ఒత్తిడి పెంచింది.
ఉత్తర కొరియా క్షిపణిని (North Korea missile test) పరీక్షించిందని దక్షిణ కొరియా, జపాన్ ఆరోపించిన మరుసటి రోజే కిమ్ సర్కార్ అధికారికంగా ధ్రువీకరించింది. క్షిపణి పరీక్షతో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా ఇండో- పసిఫిక్ కమాండ్ తెలిపింది. కానీ ఆయుధాల తయారీపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. కిమ్ జోంగ్ ఉన్ జరిపిన చర్చలు విఫలమైన తర్వాత అగ్రరాజ్యంపై ఉత్తర కొరియా ఆగ్రహంగా ఉంది. మరిన్ని అణ్వాయుధాలను సమకూర్చుకుంటామని ఇప్పటికే కిమ్ ప్రకటించారు. షరతుల్లేకుండా చర్చలు జరుపుదామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదనను కూడా కిమ్ తిరస్కరించారు.
నిషేధం విధించినా..
బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేపట్టకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇప్పటికే ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించింది. వీటిని లెక్కచేయని కిమ్ ప్రభుత్వం.. ఈ నెల మొదట్లో కొరియా బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించి ఉద్రిక్తతలు పెంచింది.
కానీ.. స్వల్ప శ్రేణి క్షిపణుల ప్రయోగాలపై ఎలాంటి ఆంక్షల్లేవు.
ఇదీ చూడండి: వెనక్కి తగ్గని 'కిమ్'.. మరో క్షిపణి ప్రయోగం