అణు దౌత్య చర్చల కోసం అమెరికా విదేశాంగ సహాయ మంత్రి స్టీఫెన్ బీగన్ దక్షిణ కొరియా వెళ్లిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది ఉత్తర కొరియా. అమెరికాతో అణుచర్చలు పునరుద్ధరించే ఆలోచన తమకు లేదని మరోమారు ఉద్ఘాటించింది. అమెరికా- ఉత్తరకొరియా మధ్య అణు చర్చల కోసం దక్షిణ కొరియా చేస్తున్న ప్రయత్నాలు అర్థంపర్థం లేనివని వ్యాఖ్యానించింది.
బీగన్ ఈ వారం దక్షిణ కొరియా, జపాన్‌లో అధికారులతో సమావేశం కానున్నారు. పలు కీలక విషయాలు సహా ఉత్తర కొరియాలో అణు నిరాయుధీకరణపై చర్చించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు అణు చర్చలకు సంబంధించి 2018 నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు సమావేశమయ్యారు. ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి. ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు దక్షిణ కొరియా మధ్య వర్తిత్వం వహిస్తోంది. అయితే చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడానికి దక్షిణ కొరియా వైఫల్యమే కారణమని ఉత్తర కొరియా ఆగ్రహంతో ఉంది. చర్చలు పునరుద్ధరించే అవకాశమే లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.
ఉత్తర కొరియాలో అణ్వాయుధ పరీక్షలను పూర్తిగా నిలిపివేయాలని అమెరికా కోరుతోంది. తమపై ఉన్న ఆంక్షలన్నింటిని ఎత్తివేస్తేనే దానిపై ఆలోచిస్తామని ఉత్తర కొరియా పట్టుబడుతోంది. ఈ విషయంలో రెండు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదరడం లేదు.