బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటనకు రానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఆయన రాకను కొన్ని వామపక్షాలు, ఇస్లామిస్ట్ గ్రూపులు వ్యతిరేకిస్తున్నప్పటికీ భయపడాల్సిందేమీ లేదని తెలిపింది. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు, బంగ బంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన ఈ నెల 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. మోదీని స్వాగతించడాన్ని గర్వంగా భావిస్తున్నామని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఏకే అబ్దుల్ మోమెన్ చెప్పారు. మోదీ రాకను ఎవరైనా వ్యతిరేకించవచ్చని, కానీ వారికి ప్రభుత్వం భయపడబోదని తెలిపారు.
పర్యటనలో భాగంగా సాత్ఖిరా, గోపాల్గంజ్ల్లోని హిందూ దేవాలయాలను మోదీ సందర్శించనున్నారు. ఇక్కడ హిందూ మతువా వర్గం వారు అధిక సంఖ్యలో ఉన్నారు. బంగాల్లో కూడా మతువాలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల వారిని ఎన్నికల్లో ఆకర్షించడానికి దీన్ని అవకాశంగా మార్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిపై విదేశాంగ సహాయ మంత్రి షహరియార్ ఆలంను ప్రశ్నించినప్పుడు అక్కడి రాజకీయాలతో బంగ్లాదేశ్‌కు సంబంధం లేదని చెప్పారు. "ఆయన మా అతిథి. ఢాకా కాకుండా ఇతర ప్రాంతాలను సందర్శిస్తానంటే మంచిదే. దీని వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది" అని అన్నారు.
ఇదీ చూడండి: అంతర్యుద్ధం దిశగా మయన్మార్!