తైవాన్ తమతో పునరేకీకరణ సాధించి తీరవలసిందేనని ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ (China Taiwan News) ఉద్ఘాటించారు. దీన్ని తైవాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఎట్టి పరిస్థితుల్లో చైనా ఒత్తిడికి తలొగ్గబోమని, తమ ప్రజాతంత్ర జీవన విధానాన్ని కాపాడుకుంటామని తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ తెగేసి చెప్పారు. ఆ తరవాత చైనా యుద్ధ విమానాలు నాలుగు రోజులపాటు తైవాన్ గగనతలంలో చక్కర్లు కొట్టాయి. తైవాన్‌ను కలుపుకోవడానికి అవసరమైతే సైనిక చర్యకూ వెనకాడబోమని బీజింగ్ ఈ విధంగా సందేశం పంపింది. తద్వారా అగ్రరాజ్యం అమెరికాకూ సవాలు విసురుతోంది. ఇటీవలి కాలంలో తైవాన్, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాలతో పదేపదే జగడానికి దిగుతూ డ్రాగన్ దేశం (China Taiwan Latest News) అంతర్జాతీయ సమాజం దృష్టిలో చెడ్డపేరును మూటగట్టుకొంటోంది. గతంలో హాంకాంగ్‌ను తనలో అంతర్భాగంగా చేసుకున్న చైనా- తైవాన్ విషయంలోనూ అదే వైఖరి అవలంబిస్తోంది.
తైవాన్ విషయంలో అమెరికా తీరు ఆసక్తికరం. 'ఒకే చైనా' విధానం కింద వాషింగ్టన్ చిరకాలంగా తైవాన్‌ను కాకుండా చైనాను అధికారికంగా గుర్తిస్తోంది. అదే సమయంలో తైవాన్-అమెరికా సంబంధాల చట్టం కింద తైవాన్‌కు (US-China News) ఆత్మరక్షణార్థం ఆయుధాలు సరఫరా చేస్తోంది. తైవాన్ జలసంధిలో శాంతి, సుస్థిరతలకు భంగం కలిగించే ఏ చర్యలనైనా గట్టిగా వ్యతిరేకిస్తామని అగ్రరాజ్యం ఇటీవల ప్రకటించింది. చైనా, తైవాన్‌ల మధ్యనున్న ఈ జలసంధి గుండా కొద్దిరోజుల క్రితం అమెరికా, కెనడాలకు చెందిన రెండు యుద్ధ నౌకలు పయనించడం చైనాకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఒకే చైనా విధానాన్ని అనుసరిస్తున్న వాషింగ్టన్- తైవాన్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేసింది. అయితే సమస్యను బలప్రయోగంతో కాకుండా ఏకాభిప్రాయంతో, తైవాన్ ప్రజల సమ్మతితో పరిష్కరించాలని చైనాను కోరుతోంది. ఒకవేళ చైనా దాడికి దిగితే తైవాన్‌ను తాము రక్షిస్తామని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. చైనా, రష్యా సహా ఇతర దేశాలకు తమ సైనిక సత్తా బాగా తెలుసనీ వ్యాఖ్యానించారు. తైవాన్‌ను చైనా బలవంతంగా కలిపేసుకుంటున్నా అమెరికా చూస్తూ ఊరుకుంటే- ఆసియాలోని దాని మిత్రదేశాలకు ప్రతికూల సంకేతాలు వెళతాయి. ఇంతకాలం అమెరికా నీడలో ఆశ్రయం పొందుతున్న తూర్పు, ఆగ్నేయాసియా దేశాలు ఇక చైనా ఛత్రం కిందకు చేరడానికి వాషింగ్టన్ తనంతటతాను పచ్చ జెండా ఊపినట్లవుతుంది. అఫ్గానిస్థాన్ నుంచి హఠాత్తుగా సేనలను ఉపసంహరించుకున్న తరవాత అమెరికా తన మిత్రుల కోసం ఎంతవరకు నిలబడుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ విషయంలో వాషింగ్టన్ మెతక వైఖరి అవలంబిస్తే చైనా దాన్ని అలుసుగా తీసుకుని విజృంభించడం ఖాయం. దీన్ని నివారించడానికి అమెరికా క్వాడ్‌ను క్రియాశీలం చేస్తూ ఆస్ట్రేలియా, బ్రిటన్‌లతో కలిసి ఆకుస్ కూటమిని ఏర్పరచింది. తైవాన్ విషయంలో అమెరికా, చైనాలకు భేదాభిప్రాయాలున్నా- అవి సాయుధ ఘర్షణకు దారితీయకుండా నాలుగు దశాబ్దాలుగా సంయమనం పాటిస్తూ వచ్చాయి. పరస్పర ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకున్నాయి. అమెరికా మద్దతుతో తైవాన్ అనూహ్య ఆర్థికాభివృద్ధి సాధించి ఆసియా టైగర్స్‌లో ఒకటిగా ఎదిగింది. ఏక పార్టీ నియంతృత్వాన్ని వదిలించుకొని బహుళపక్ష ప్రజాస్వామ్యంగా అవతరించింది.
చైనా ఇటీవల ప్రదర్శిస్తున్న దూకుడు క్లిష్ట పరిస్థితులకు దారితీస్తోంది. దక్షిణ చైనా సముద్రం తనదేనంటూ జులుం ప్రదర్శించడం, అవాంఛనీయ వాణిజ్య పద్ధతులను అనుసరించడం, ఇరుగుపొరుగు దేశాలపై ఆర్థికంగా ఒత్తిడి తేవడం అమెరికా-చైనా సంబంధాలను దిగజార్చాయి. తైవాన్ విషయంలో చైనా యుద్ధానికి దిగే పరిస్థితి లేదన్న సూత్రీకరణలూ వినవస్తున్నాయి. బీజింగ్ ప్రస్తుతం పలు సమస్యలతో సతమతమవుతోంది. స్వదేశంలో కనీవినీ ఎరగని విద్యుత్ కొరత వచ్చిపడింది. దేశంలో అతిపెద్ద స్థిరాస్తి సంస్థ దివాలా అంచున ఊగిసలాడుతోంది. నవంబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. కొన్ని నెలల్లో శీతాకాల ఒలింపిక్స్‌ను నిర్వహించవలసి ఉంది. చైనా, తైవాన్ అధినేతలు ఇటీవల చేసిన ప్రసంగాలు తాత్కాలికంగానైనా ఉద్రిక్తతలను చల్లార్చేలా ఉన్నాయి. తైవాన్ పునరేకీకరణకు బీజింగ్ కట్టుబడి ఉన్నా, అది శాంతియుతంగా జరగడం రెండు దేశాల ప్రజలకూ ప్రయోజనకరమని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఉద్ఘాటించారు. రెండు దేశాల మధ్య చర్చలు సమాన ఫాయాలో జరగాలనే అభిలాషను తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఏడాది చివరకు అమెరికా, చైనా అధ్యక్షుల సమావేశానికి రెండు దేశాలూ సన్నాహాలు మొదలుపెట్టాయి. అది తైవాన్ భవిష్యత్తును నిర్ణయిస్తుందా లేదా అన్నది వేచి చూడవలసిందే.
- ఆర్య
ఇదీ చూడండి: 'చైనాతో చర్చలు.. ప్రతిసారి ఫలితాలు రావు'