కొరియన్ ద్వీపకల్పంలో గత వారం సంభవించిన మేసాక్ తుపాను ప్రభావిత ప్రాంతాలను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సందర్శించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. తుపాను సహాయక చర్యల్లో అలసత్వం వహించిన పలువురు ఉన్నతాధికారులను విధుల నుంచి తప్పించినట్లు తెలిపింది.
జనమెక్కడ?
పలువురు అధికారులతో కలిసి కిమ్ పర్యటిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియోను అక్కడి మీడియా ప్రసారం చేసింది. ఇందులో కిమ్, అధికారులు తప్ప మరో మనిషి కనిపించకపోవడం గమనార్హం. హమ్ గ్యాంగ్ రాష్ట్రంలో దాదాపు 1000 ఇళ్లు కూలిపోయాయని కిమ్ తెలిపినట్లు కథనాలు ప్రసారమయ్యాయి. అయితే, శనివారం ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తా పత్రిక తుపాను వల్ల కాంగ్వోన్ రాష్ట్రంలో తీవ్ర ప్రాణ నష్టం జరిగినట్లు వెల్లడించింది.
రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి 12 వేల మంది అధికార వర్కర్స్ పార్టీ సభ్యులను.. టైపూన్ సహాయక చర్యల నిమిత్తం పంపుతానని కిమ్ హామీ ఇచ్చినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. సాధారణంగా ఉత్తరకొరియాలో అత్యవసర సమయాల్లో నగరవాసులు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి సహాయం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తరచుగా పౌరులను సమీకరిస్తూ ఉంటుంది అక్కడి ప్రభుత్వం. కానీ, రాజధాని నుంచి ఇలా వేలాది మందిని ఇతర ప్రదేశాలకు పంపడం చాలా అరుదు.
అమెరికా ఆంక్షలు సహా.. కరోనా మహమ్మారి సమయంలో ప్రజల్లో తనపై విశ్వాసం సన్నగిల్లిన నేపథ్యంలో ఈ సందర్శన ద్వారా తాను ప్రజా నాయకుడినని చాటుకోవడానికి.. కిమ్ ప్రయత్నించినట్లు సమాచారం.
తుపాను నష్టంపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కిమ్, రాజకీయంగా దెబ్బతిన్న ప్రతిష్ఠను పెంచే చర్యలను చేపట్టాలని.. ఐకమత్యంగా కలిసి ఉండాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
మాస్క్ లేని పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో కిమ్ పర్యటించడం చాలా అరుదు. 2015 సెప్టెంబరులో ఓ సారి వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన ఆయన, ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాదే తొలిసారిగా తుపాను కారణంగా నష్టపోయిన ప్రాంతంలో స్వయంగా పర్యటించారు.
కిమ్ పర్యటనలో పాల్గొన్న ఏ ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించినట్లు కనిపించలేదు. కనీసం మాస్కు ధరించకపోవడం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదని వాదిస్తోంది ఉత్తర కొరియా ప్రభుత్వం. అయితే, కేసులున్నా బయటపెట్టకుండా మభ్యపెడుతున్నారంటున్నారు విదేశీ విశ్లేషకులు. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ కిమ్ తన కుటుంబ పాలనను బలోపేతం చేసేందుకు వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారని పరిశీలకులు చెబుతున్నారు.
మరో తుపాను
మరో రెండు మూడు రోజుల్లో కొరియాకు హైషెన్ అనే మరో తుపాను ప్రమాదం పొంచి ఉందని దక్షిణ కొరియా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, తుపానును ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది ఉత్తర కొరియా.
ఇదీ చదవండి: కిమ్ 'ట్రైన్' అక్కడ ఎందుకుంది? ఆయన ఎలా ఉన్నారు?