ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 99 శాతం మరణించేందుకే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు దక్షిణ కొరియా రాజకీయవేత్త.. ఉత్తర కొరియా వ్యవహారాలతో సంబంధమున్న జి సియోంగ్ హో. కిమ్ మృతిపై పలు రకాల వార్తా కథనాలు వెలువడుతున్న సమయంలో ఈ అంశమై తన ఉద్దేశాలను వెలిబుచ్చారు. మూడు వారాలుగా కిమ్ బయట కనిపించని కారణంగా ఆయన ఆరోగ్యంపై సర్వత్రా సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అభిప్రాయాలను స్థానిక యోన్హప్ వార్తాసంస్థతో పంచుకున్నారు జి.
" గుండె ఆపరేషన్ జరిగిన అనంతరం ఆయన ఇంతకాలం బతికి ఉండటం పట్ల నాకు ఆశ్చర్యం వేసింది. గతవారమే కిమ్ మరణించారని నాకు సమాచారం అందింది. అయితే మరణవార్త నిర్ధరణ కాలేదు. 99 శాతం ఆయన మరణించేందుకే అవకాశం ఉంది. ఉత్తర కొరియాలో వారసత్వ సమస్య త్వరలో మొదలుకావొచ్చు."
-జి సియోంగ్ హో, దక్షిణ కొరియా రాజకీయ వేత్త
కిమ్ ఆరోగ్యానికి సంబంధించి తనకు సమాచారం ఎలా అందిందో చెప్పేందుకు నిరాకరించారు జి.
'యో జోంగే వారసురాలు'
కిమ్ సోదరి.. కిమ్ యో జోంగ్ తదుపరి ఉత్తర కొరియా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఉందని తెలిపారు జి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో దక్షిణ కొరియా చట్టసభ సభ్యుడుగా ఎన్నికైన జి.. ఉత్తర కొరియా నుంచి అక్కడికి వలస వెళ్లారు.
'ఇంకా నిర్ధరణ కాలేదు'
అయితే కిమ్ మరణించారని తెలిపే ఎలాంటి సంకేతమూ ఉత్తర కొరియా నుంచి వెలువడలేదని ప్రకటించింది దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం.
ఇదీ చూడండి: ముంబయికి ఫ్లెమింగో వలస పక్షుల తాకిడి!