వ్యక్తిగతంగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన న్యూజిలాండ్ ఆరోగ్యమంత్రి డేవిడ్ క్లార్క్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
"నేను ఓ ఇడియట్. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించాను. ప్రజల ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలను. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను."
- డేవిడ్ క్లార్క్, న్యూజిలాండ్ ఆరోగ్యమంత్రి
తన పదవికి రాజీనామా చేసిన డేవిడ్ క్లార్క్... మంత్రిగా కరోనా నియంత్రణ కోసం శాయశక్తులా కృషి చేసినట్లు పేర్కొన్నారు. అయితే తాను పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
సర్వత్రా ప్రశంసలు
కరోనా నియంత్రణలో న్యూజిలాండ్ సాధించిన విజయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. అయితే స్వయంగా ఆరోగ్యమంత్రే లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి.
ఇటీవల విదేశాల నుంచి వచ్చిన కొంతమందికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, కనీసం క్వారంటైన్లో ఉంచకుండా దేశంలోకి అనుమతించారు. ఈ విషయంలో కూడా డేవిడ్‌పై విమర్శలు వచ్చాయి.
అలాగే ఏప్రిల్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి డేవిడ్ 19 కి.మీ మేర బీచ్ వాక్ చేశారు. ఓ వైపు కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా కఠిన లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరుతున్న సమయంలో... స్వయంగా ఆరోగ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మౌంటైన్ బైకింగ్ కోసం డేవిడ్ తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ పార్కుకు డ్రైవింగ్ చేస్తూ వెళ్లారు. ఈ విషయంలోనూ... తాను నిబంధనలు ఉల్లంఘించినట్లు డేవిడ్ ఒప్పుకున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
కరోనా మహమ్మారితో పోరు సాగిస్తున్న ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో... ఆరోగ్య రంగంలో జరిగే తప్పులను భరించడం కష్టమని న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ తేల్చిచెప్పారు. మొదట ఆమె... అసోసియేట్ ఆర్థిక మంత్రిగా ఉన్న డేవిడ్ క్లార్క్‌ను బాధ్యతల నుంచి తప్పించి, కేబినెట్ ర్యాంకింగ్ స్థాయినీ తగ్గించారు. అయినా ప్రజాగ్రహం తగ్గలేదు. దీనితో చివరకు ఆయన రాజీనామాను అంగీకరించారు. తరువాత విద్యామంత్రిగా పనిచేస్తున్న క్రిష్ హాప్కిన్స్కు ఆరోగ్యమంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
మరో మూడు నెలల్లో న్యూజిలాండ్ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జెసిండా ఆర్డెర్న్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పుడు (లిబరల్ లేబర్ పార్టీ) జెసిండా తీసుకున్న చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అయితే ఇటీవల స్వదేశంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో నేషనల్ పార్టీ నాయకుడు టాడ్ ముల్లర్ బలం పుంజుకున్నట్లు స్పష్టమైంది.
ఇదీ చూడండి: ఇద్దరు భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం