అఫ్గానిస్థాన్ పరిణామాలపై(Afghan Crisis) పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ దేశంలో తాలిబన్ల అధికారాన్ని(Afghanistan Taliban) చేపట్టడం వల్ల అఫ్గాన్‌లో సరికొత్త శకం ఆరంభమైందని చెప్పింది. ఈ మేరకు తజికిస్థాన్ రాజధాని దుషన్‌బే వేదికగా జరిగిన షాంఘై సహకార సదస్సులో(SCO Summit 2021) పాల్గొన్న పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ యుద్ధాలను ఎదుర్కొన్న అఫ్గాన్‌లో ఇకపై ఘర్షణలు చెలరేగకుండా అంతర్జాతీయ సమాజం(SCO Summit 2021) సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు. మరోసారి ఉగ్రవాదులకు అడ్డాగా మారనివ్వకూడదని చెప్పారు.
"అఫ్గానిస్థాన్ నుంచి విదేశీ బలగాలు తరలి వెళ్లి, అక్కడ తాలిబన్లు అధికారాన్ని చేపట్టడం ప్రపంచ దేశాలకు ఉపశమనం కలిగించే విషయం.రక్తపాతం లేకుండా, పౌర యుద్ధాలు జరగకుండా, ఎక్కువ మంది శరణార్థులుగా వెళ్లే అవకాశం లేకుండా తాలిబన్లు.. అఫ్గాన్‌లో పాలనా పగ్గాలు చేపట్టారు. పాత ప్రభుత్వం స్థానంలో తాలిబన్లు ఆకస్మాత్తుగా చేరడం ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ, ఇదే అఫ్గాన్‌కు నిజమైన స్వరూపాన్ని ఇస్తుంది."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాన మంత్రి.
అఫ్గాన్‌లో మానవతా సంక్షోభాన్ని అరికట్టడం, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో సమ ప్రాధాన్యమివ్వాలని ఇమ్రాన్ పేర్కొన్నారు. "అఫ్గాన్‌లో పాత ప్రభుత్వం అంతా విదేశీ సాయం పైనే ఆధారపడి పని చేసిందని మనకు తెలుసు. అఫ్గాన్ నుంచి విదేశీయులు తరలి వెళ్లగానే.. అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇది నిస్సందేహంగా అప్గాన్ ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం" అని చెప్పారు. సమ్మిళిత రాజకీయ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాలని పేర్కొన్నారు.
'అఫ్గాన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం'
మరోవైపు.. షాంఘై సహకార సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. అఫ్గాన్‌లోని తాలిబన్లు సమ్మిళిత రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ఎస్సీఓ దేశాలు సమన్వయంతో సాగాలని తెలిపారు. తాలిబన్ల పాలన మితవాద విధానాలతో సాగేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అన్ని రకాల ఉగ్రవాదంతో పోరాడాలని చెప్పారు.
"విదేశీ బలగాలు ఉపసంహరణ తర్వాత.. అఫ్గాన్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. కానీ, అఫ్గాన్ ఇంకా భయంకరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ దేశానికి అంతర్జాతీయ సహకారం అందించడం, మద్దతుగా నిలవడం అవసరం. ముఖ్యంగా ఎస్సీఓ దేశాలు ఇందులో పాలుపంచుకోవాలి. ఎస్సీఓ-అప్గానిస్థాన్ కాంటాక్ట్ గ్రూపు వంటిది ఏర్పాటు చేసుకుని, సమన్వయంతో సాగాల్సిన అవసరం ఉంది."
-జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు
అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో చైనా సన్నిహత సంబంధాలను ఏర్పరచుకుంది. ఆ దేశంలో ఆకలి బాధలు తీర్చేందుకు, వ్యాక్సిన్ల కోసం 31 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది.
'వారిది సమ్మిళత ప్రభుత్వమైతే కాదు'
అఫ్గాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వం సమ్మిళిత ప్రభుత్వం కాకోపోయినా.. వారితో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. షాంఘై సహకార సదస్సులో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.
"తాలిబన్లు తమది ఆపద్ధర్మ ప్రభుత్వం అని చెబుతున్నారు. కానీ, అది సమ్మిళిత ప్రభుత్వమైతే కాదు. అయినప్పటికీ వారితో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో మనం సమన్వయంతో సాగాలని నేను విశ్వసిస్తున్నాను." అని పుతిన్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: