నేపాల్ రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. ప్రధాని కేపీ శర్మ ఓలి, కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) మధ్య విబేధాలు పరిష్కరించడంలో నేపాల్ కమ్యుూనిస్టు పార్టీ విఫలమైంది. 7 సార్లు వాయిదా తర్వాత మంగళవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో అసలు ప్రధాని ఓలి పాల్గొనకపోవడం గమనార్హం.
రాజకీయ అంశాలు చర్చించలేదు!
ఎన్సీపీ స్టాండింగ్ కమిటీ సమావేశం... కాఠ్మాండూ బలూవతార్లోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగింది. అయితే ఈ సమావేశంలో రాజకీయ అంశాలను చర్చించలేదని కమిటీ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత గణేశ్ షా పేర్కొన్నారు. దేశంలో వరదల బీభత్సం, కరోనా ఉద్ధృతిపై మాత్రమే చర్చించినట్లు తెలిపారు. తదుపరి సమావేశం ఈనెల 28న ఉదయం 11 గంటలకు జరుగుతుందని స్పష్టం చేశారు.
వాయిదాల పర్వం
అధికారం పంచుకునే విషయంలో ప్రచండ, ఓలీ మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఎన్సీపీ స్టాండింగ్ కమిటీ ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. ఇప్పటికే ఏడు సార్లు కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా పడడం గమనార్హం.
ఇదీ చూడండి: 'అన్ని దేశాలకు కరోనా వ్యాపించేలా చైనా కుట్ర'