అగ్రదేశాలకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తరకొరియా తమ సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రదర్శించింది. ఏకకాలంలో బహుళ క్షిపణులను ప్రయోగించగలిగే రాకెట్ లాంచర్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్టు ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. ఈ ప్రయోగం.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో జరిగిందని పేర్కొంది. అయితే కిమ్ వేసిన తాజా అడుగు అమెరికాతో చర్చలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.
రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించిందని శనివారం దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. కానీ అది బహుళ రాకెట్ లాంచర్ అతిపెద్ద లాంచర్ అని ఉత్తర కొరియా మీడియా స్పష్టం చేసింది.
నూతనంగా రూపొందించిన క్షిపణి వ్యవస్థ అద్భుత ఆయుధమని కిమ్ జోంగ్ ఉద్ఘాటించారు. తయారు చేసిన శాస్త్రవేత్తలను కిమ్ మెచ్చుకున్నారని ఆ దేశ మీడియా స్పష్టం చేసింది.
ఈ నెలలో ఉత్తరకొరియా ఆయుధ పరీక్షలను నిర్వహించడం ఇది మూడోసారి. ఉత్తరకొరియా చర్యపై... దక్షిణ కొరియా జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించింది.
"కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ చేసేందుకు అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తెచ్చి ఉత్తరకొరియాను... అమెరికాతో మళ్లీ చర్చలకు ఒప్పించేందుకు జాతీయ భద్రతామండలి సభ్యులు నిర్ణయించారు."
- దక్షిణ కొరియా ప్రకటన
ఇదీ చూడండి: నేడు కమల 'గళపతి'కి అంతిమ వీడ్కోలు