సైనిక పాలనతో మయన్మార్లో హింస అంతకంతకూ పెరిగిపోతోంది. సైనికులు.. ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎలాంటి నేరం చేయకున్నా అరెస్టులు చేస్తూ దేశమంతా దాదాపు ఒకే రకమైన పద్ధతిలో వేదనకు గురి చేస్తున్నారు.
సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడం సహా ఇతర చిన్న చిన్న కారణాలతో ప్రజల్ని నిర్బంధించి.. హింసిస్తున్నారు.
ది అసోసియేటెడ్ ప్రెస్.. నిర్బంధంలో ఉన్నవారిని, జైళ్ల నుంచి విడుదలైన కొందరిని ఇంటర్వ్యూ చేయగా ఈ విషయాలు బహిర్గతమయ్యాయి.
ఓ యువకుడి చర్మాన్ని కటింగ్ ప్లయర్లతో తీసి హింసించారు సైనికులు. శ్వాస ఆగిపోయేవరకు ఛాతిపై పదేపదే కొట్టారు. వ్యక్తిని రెచ్చగొట్టేలా కుటుంబం గురించి పరుష పదజాలంతో మాట్లాడారు.
యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్పై ఇంటికి వెళుతున్న క్రమంలోనే అరెస్టు చేసి టార్చర్ సెంటర్లో చిత్రహింసలు పెట్టారు. సైనికుల వేధింపుల ధాటికి.. పాపం ఆ వ్యక్తి ఏం చేయలేకపోయాడు. అర్థం పర్థం లేని ప్రశ్నలు వేస్తూ.. చికాకు తెప్పించడమే కాక కనికరం లేకుండా కొట్టినట్లు ఆ వ్యక్తి మొరపెట్టుకున్నాడు.
మరికొన్నిచోట్ల నోట్లో తుపాకులు పెట్టి బెదిరించడం, పదునైన ఆయుధాలపై మోకాళ్లు పెట్టి కూర్చోమనడం వంటివి చేస్తున్నారు.
తిరుగుబాటుతో..
ఈ ఫిబ్రవరిలో తిరుగుబాటు చేసి.. ప్రభుత్వాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు సైనికులు. మయన్మార్ అధినేత్రి, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ సహా పలువురిని గృహనిర్బంధం చేశారు.
ఈ చర్యను ప్రపంచ దేశాలు ఖండించాయి. అయినా మారని అక్కడి సైన్యం ప్రజల్ని హింసిస్తూ పాలన కొనసాగిస్తోంది. ఇన్ని నెలలుగా జరుగుతున్న నిరసనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మందిని నిర్బంధించారు. ఈ నేపథ్యంలో తామెలా బతకాలో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఇవీ చూడండి: 'మరో రెండేళ్ల పాటు నేనే ప్రధాని'