మయన్మార్‌లో సైనిక అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రజాస్వామ్య మద్దతుదారుల నిరసనలను అడ్డుకునేందుకు మంగళవారం తూర్పు మయన్మార్‌లో ఆ దేశ సైన్యం వైమానిక దాడులు జరిపింది. ఇటీవలే ఆగ్నేయ మయన్మార్‌లోని కరేన్ రాష్ట్రంలో వైమానిక దాడులు చేయగా... వేల మంది పౌరులు థాయ్‌లాండ్‌కు పారిపోయారు. ఈ నేపథ్యంలో సైన్యం మరోమారు దాడులు జరపడం గమనార్హం.
సైన్యం మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో ఆరుగురు పౌరులు మృతిచెందారని, 11 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని కరేన్ నేషనల్ యూనియన్ విదేశాంగ శాఖకు చెంది సా టావ్ నీ పేర్కొన్నారు.
స్వచ్ఛందంగా తిరిగెళ్లారు..
ఇటీవల సైనిక చర్యలకు భయపడి తమ ప్రాంతానికి వచ్చిన పౌరులను థాయ్‌లాండ్ భద్రతా బలగాలు వెనక్కిపంపాయన్న ఆరోపణలపై ఆ దేశ ప్రధాని స్పందించారు. పౌరులు స్వచ్ఛందంగానే థాయ్‌లాండ్ నుంచి తిరిగివెళ్లినట్లు స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 1న మయన్మార్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనను తమ చేతుల్లోకి తీసుకుంది ఆ దేశ సైన్యం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ ప్రజలు కొద్ది వారాలుగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అయితే.. సైనిక ప్రభుత్వ హింసాకాండలో ఇప్పటివరకు 500 మందికిపైగా పౌరులు మృతిచెందారు.
ఇదీ చదవండి:చెర్రీ పూల వసంతం- జపాన్‌కు కొత్త సోయగం