మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పులు ఒక యువతి ప్రాణాలను బలిగొన్నాయి. ఫిబ్రవరి 9న జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మయా థ్వెట్ ఖైన్ అనే యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషయాన్ని శుక్రవారం ఆమె కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.
యువతి మృతితో భగ్గుమన్న నిరసనకారులు ఆమెకు నివాళులర్పించేందుకు రోడ్లపైకి వచ్చి సైన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దేశంలో నియంతృత్వ పాలనను అంతమొందించాలని నినదించారు. యువతి చిత్రపటానికి పూలాభిషేకం చేశారు.
పుట్టినరోజుకు ముందే దారుణం..
మయా థ్వెట్ ఖైన్ అనే యువతి పుట్టినరోజుకు రెండురోజుల ముందు రాజధాని నేపిడాలో పోలీసులు కాల్చి చంపారు. ఆమె జ్ఞాపకార్థంగా వేలమంది నిరసనకారులు యాంగూన్‌లో ఆందోళనలు చేశారు. సదరు యువతి పోలీసు కాల్పులు, నీటి ఫిరంగులను తప్పించుకొనేందుకు చేసిన ప్రయత్నం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరకు ఆమె ధరించిన హెల్మెట్‌ను చీల్చుకుంటూ వచ్చిన బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందింది.
సహాయ నిరాకరణ..
ఇక మయన్మార్‌లోని మరో ప్రధాన నగరం మాండలేలో వైద్య విశ్వవిద్యాలయ విద్యార్థులు 1000 మంది.. సైన్యం కాల్పుల్లో బలైన యువతికి నివాళులర్పించారు. ఈ ఘటనను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ చేపట్టాలని వైద్యులు, ఇంజినీర్లు సహా ఇతర పౌరసంఘాలు నిర్ణయించాయి. సైన్యం పెద్దఎత్తున అణచివేస్తున్నా.. ఆందోళనకారులు వెనక్కి తగ్గకుండా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. నిర్బంధంలో ఉన్న ఆంగ్ సాన్ సూచీ విడుదలకు పట్టుబడుతూ.. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
అమెరికా ఆక్షేపణ..
మరోవైపు యువతి మృతి పట్ల అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతియుత నిరసనలపై హింసకు పాల్పడటం హేయమైన చర్యగా అమెరికా అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అభివర్ణించారు.. మయన్మార్ మిలిటరీ నాయకులు అవలంబిస్తోన్న విధానాలను ఆక్షేపించారు.
ఇదీ చదవండి: మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు- ఖండించిన ప్రపంచ దేశాలు