అఫ్గానిస్థాన్ దేశ నూతన అధిపతిగా (taliban government) తాలిబన్ కీలక నేత ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ (mohammad hassan akhund) ఎంపికయ్యారు. తాలిబన్ టాప్ లీడర్ ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా (haibatullah akhundzada) స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.
తాలిబన్‌లోని శక్తిమంతమైన విభాగమైన 'రెహ్బరీ షురా'కు (rahbari shura) హసన్ అఖుంద్ నాయకత్వం వహిస్తున్నారు. గతంలో తాలిబన్ ప్రభుత్వం కొనసాగినప్పుడు.. విదేశాంగ మంత్రి, డిప్యూటీ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెహ్బరీ షురా అనేది ప్రభుత్వ కేబినెట్ మాదిరిగా పనిచేస్తుంది. తాలిబన్‌కు సంబంధించిన ప్రతి అంశం ఇక్కడే చర్చిస్తారు. అధినేత ఆదేశాల ప్రకారం ఏ నిర్ణయమైనా ఈ సమావేశాల్లోనే తీసుకుంటారు.
దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ ఛైర్మన్ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ (abdul ghani baradar), ముల్లా అబ్దుస్ సాలమ్.. తాలిబన్ ప్రభుత్వంలో అధ్యక్షుడికి డిప్యూటీలుగా వ్యవహరించనున్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి వివరాలు వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉందని తెలిపింది. విశ్వసనీయ తాలిబన్‌కు వర్గాలు అందించిన సమాచారం మేరకు ఈ వార్త వెలువరించింది.
దీని ప్రకారం ఏ పోస్ట్‌లో ఎవరంటే...
- రక్షణ మంత్రి: ముల్లా యాకుబ్, తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్ ఒమర్ కొడుకు.
- హోం మంత్రి: సిరాజుద్దీన్ హక్కానీ, హక్కానీ నెట్వర్క్ (haqqani network) అధిపతి.
- విదేశాంగ మంత్రి: ముల్లా అమీర్ ఖాన్ ముత్తాఖీ.
- ప్రభుత్వ అధినేత ప్రతినిధి: జబియుల్లా ముజాహిద్.
వాంటెడ్ టెర్రరిస్ట్...
అంతర్గత మంత్రిగా ఎంపికైనట్టు పాక్ మీడియా పేర్కొన్న సిరాజుద్దీన్ హక్కానీ (sirajuddin haqqani).. ఓ పేరుమోసిన అంతర్జాతీయ ఉగ్రవాది. సోవియట్‌పై యుద్ధం చేసిన జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్. పాక్‌లో ఉన్నట్లు భావిస్తున్న ఇతడి ఆచూకీ, అరెస్టు కోసం అమెరికా ప్రభుత్వం 5 లక్షల డాలర్లు ప్రకటించింది. 2008లో కాబుల్ హోటల్‌పై దాడి, అమెరికా దళాలపై దాడికి కుట్ర, 2008లో అప్పటి అఫ్గాన్ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ హత్యకు యత్నం వంటి కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా చేర్చింది అమెరికా ఎఫ్‌బీఐ.
ఇరాన్ తరహాలో!
అంతర్జాతీయ సమాజం ఆమోదించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. నూతనంగా ఏర్పడే ప్రభుత్వం (afghan new government) ఇరాన్ నాయకత్వాన్ని పోలి ఉంటుందని భావిస్తున్నారు. మతాధిపతిగా, తాలిబన్ టాప్ లీడర్‌గా ముల్లా హెబతుల్లా అఖుంద్జాదా.. అఫ్గానిస్థాన్‌పై సంపూర్ణ అధికారం కలిగి ఉంటారు. సైనిక, ప్రభుత్వ, న్యాయ అధికారులను నియమిస్తారు. దేశ వ్యవహారాల్లో ఈయన చెప్పేదే వేదంగా ఉంటుంది.
ఇదీ చదవండి: