రష్యా విపక్ష నేత, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యర్థి.. అలెక్సీ నావల్నీని జైలుకు పంపాలని మాస్కో కోర్టు మంగళవారం ఆదేశించింది. రెండున్నరేళ్ల కంటే ఎక్కువగా శిక్ష విధించాలని తన తీర్పులో చెప్పింది. ఈ మేరకు క్రెమ్లిన్‌ను ఆదేశించింది.
గత ఏడాది స్వదేశంలో విష ప్రయోగానికి గురైన నావల్నీ.. జర్మనీలో దాదాపు ఐదు నెలల చికిత్సతో కోలుకున్నారు. ఈ సమయంలో నావల్నీ తనకు రష్యా విధించిన నిబంధనల్ని ఉల్లంఘించారని కోర్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 17న రష్యా చేరుకున్న నావల్నీని విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని పేర్కొంటూ అరెస్టు చేశారు. ఈ ఆరోపణలన్నీ అధికార పార్టీ కల్పితాలని నావల్నీ ఖండిస్తున్నారు.
ఆయనను విడుదల చేయాలంటూ కొన్ని రోజులుగా రష్యా అంతగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతల్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. ఇంతలోనే చికిత్స సమయంలో నిబంధనలు పాటించలేదన్న కారణంతో నావల్నీని జైలుకు పంపాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
ఖండించిన అమెరికా..
కోర్టు తీర్పు అనంతరం స్పందించిన అమెరికా.. నావల్నీని విడుదల చేయాలని పునరుద్ఘాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిర్బంధించిన రష్యన్ పౌరుల్ని విడుదల చేయాలని కోరారు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్.
కోర్టు తీర్పుతో మరోసారి పెద్ద ఎత్తున నావల్నీ మద్దతుదారులు.. రష్యన్ వీధుల్లో నిరసనబాట పట్టారు. సుమారు 1000 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళనల దృష్ట్యా.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది రష్యా అధికార యంత్రాంగం.
నావల్నీని అరెస్టు చేసినప్పటినుంచీ ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 6 వేల మందిని నిర్బంధించారు. సెయింట్‌పీటర్స్ బర్గ్, మాస్కోలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ చూడండి: పుతిన్‌కు బైడెన్ ఫోన్- ఆ విషయాలపై ఆందోళన