ప్రపంచ దేశాలకు కరోనా టీకాలను సరసమైన ధరలకు, న్యాయంగా అందించాల్సిన అవసరముందని భారత్, ఆస్ట్రేలియా ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇందుకోసం ఉన్న మార్గాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ఫోన్లో చర్చించారు. కరోనాపై పోరులో అందించిన సహకారానికిగానూ ధన్యవాదాలు తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు 'వర్తక సంబంధిత మేధో సంపత్తి హక్కుల'(ట్రిప్స్) నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో భారత్, దక్షిణాఫ్రికా చేసిన అభ్యర్థనకు మద్దతివ్వాలని ఆస్ట్రేలియా ప్రధానిని కోరారు మోదీ.
ట్రిప్స్ నిబంధనలు మాఫీ చేయడం ద్వారా వ్యాక్సిన్ తయారీ సంస్థలకు.. సంబంధిత సాంకేతికతను నేరుగా అందించే అవకాశం ఉంటుంది. వాణిజ్య ఆంక్షలు, అంతర్జాతీయ వివాదాలతో సంబంధం లేకుండా.. వేగంగా టీకాల ఉత్పత్తి సాధ్యమవుతుంది.
ఇండో పసిఫిక్‌పై...
2020 జూన్ 4న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ తర్వాత ద్వైపాక్షిక బంధం బలోపేతం దిశగా సాధించిన పురోగతిపై మోదీ, మోరిసన్ సమీక్షించారు. ఇరు దేశాల మైత్రి మరింత బలపడాలని కాంక్షించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్వేచ్ఛ, సుస్థిరతలకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని ఇరు ప్రధానులు మరోసారి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'బైడెన్జీ.. ఆ విషయంలో భారత్‌కు మద్దతివ్వండి'