కొవిడ్-19 మహమ్మారితో ఏర్పడిన అనూహ్య పరిణామాల వల్ల వచ్చే ఏడాది భారీ స్థాయిలో తట్టు వ్యాధి చెలరేగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థలో తట్టు, రుబెల్లా టీకాలపై ఏర్పడ్డ కార్యచరణ బృందం అధిపతి కిమ్ ముల్హోలాండ్ తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చిన్నారులకు ఈ ఏడాది తట్టు టీకాలు వేయలేదని ఆయన చెప్పారు. దీంతో భవిష్యత్లో ఆ వ్యాధి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. రానున్న సంవత్సరాల్లో తట్టు మహమ్మారిని నివారించడానికి తక్షణ అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు కిమ్ నేతృత్వంలోని బృందం... ప్రముఖ వైద్యపత్రిక 'ద లాన్సెట్'లో ఓ వ్యాసం ప్రచురించింది.
కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రయాణాలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల పెద్దగా తట్టు చెలరేగలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల పడిన ఆర్థిక ప్రభావం వల్ల బాలల్లో పోషకాహార లోపం తలెత్తవచ్చని వివరించారు. దీనివల్ల తట్టు విజృంభించవచ్చని పేర్కొన్నారు. పలు కేసుల్లో ఇది మరణాలకూ దారితీయవచ్చన్నారు. ప్రస్తుతమున్న 'ఎ విటమిన్' లోపం వల్ల తట్టుతో ముడిపడిన అంధత్వం సంభవించొచ్చని కూడా హెచ్చరించారు. కరోనా వల్ల... టీకాలతో తగ్గే అవకాశమున్న వ్యాధులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు.
ఇదీ చూడండి: '6 నెలల్లో వందకుపైగా ప్రకృతి వైపరీత్యాలు'