ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్... పందుల్లో వ్యాపించే జ్వరం. ఈ వ్యాధి ఇప్పుడు దక్షిణ కొరియాను వణికిస్తోంది. ఈ జ్వరంతో మనుషులకు పెద్దగా ప్రమాదం లేదు. ఇబ్బంది అంతా పందులకే. ఒక్కసారి వచ్చిందంటే ఆ పంది చనిపోవడం ఖాయం. ఆ వ్యాధి ఇతర పందులకూ వ్యాపిస్తుంది. వాటికీ మరణమే గతి.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కు సంబంధించి సెప్టెంబర్‌లో తొలి కేసు నమోదైంది. వెంటనే దక్షిణ కొరియా ప్రభుత్వం అప్రమత్తమైంది. అంటువ్యాధి వ్యాపించకుండా చూసేందుకు పందుల్ని చంపడమే ఉత్తమ మార్గమని నిర్ణయించింది.
ఇప్పటివరకు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ బారిన పడిన 3 లక్షల 80వేల పందుల్ని వధించింది దక్షిణ కొరియా. ఇటీవల 47 వేల వరాహాల మృతదేహాలను సియోల్‌కు సమీపంలోని కొరియా సరిహద్దుల్లో పడేసింది. అయితే గతవారం భారీ వర్షం కురవగా... పందుల రక్తం సమీపంలోని ఇమ్జిన్ నదిలోకి ప్రవహించింది.
"నది ఎర్రగా మారడాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నీటి నుంచి వెలువడుతున్న దుర్గంధాన్ని పీల్చడం కష్టంగా ఉంది. నది సమీపంలో పని చేయలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు."
-లీ సియోక్ ఊ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి
నెత్తుటిమయం అయిన నదిని శుభ్రపరిచేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. తాగు నీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి : మొండి బకాయిలకు కారణం 'కొత్త కుర్రోళ్లే'..!