మనం ద్రవ రూపంలో ఏది తాగినా అది ముత్రాశంలోకి చేరిపోతుంది. అది నిండగానే మనకు మూత్రం పోయాలన్న సంకేతాలు అందుతాయి. కానీ చైనాలో ఓ వ్యక్తి పది సీసాల బీర్లు తాగి.. హాయిగా పడుకున్నాడు.. లేచేసరికి అతడి మూత్రాశయం పగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్లటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు.
వివరాళ్లోకి వెళ్తే..
నలభైయేళ్ల హూ.. ఇటీవల ఓ రాత్రి బార్‌లో 10 బీర్లు తాగేసి.. ఇంటికి వెళ్లి పడుకున్నాడు. 18 గంటల తర్వాత నిద్ర లేచిన అతడికి కడుపులో తీవ్రమైన నొప్పి రావటం వల్ల కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరీక్షించి నివ్వెరపోయారు. హూ మూత్రాశయం మూడు చోట్ల పగిలి.. ద్రవం కడుపులోకి చేరిందట. వెంటనే అతడికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. పడుకునే ముందు హూ మూత్రానికి వెళ్లలేదని.. ఆల్కాహాల్ నాడీ వ్యవస్థను మొద్దుబారేలా చేయడం వల్ల అతడికి మూత్రానికి వెళ్లాలన్న సంకేతాలు రాలేదని వైద్యులు తెలిపారు. సరైన సమయానికి అతడిని ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. లేకపోతే కణజాలం చచ్చిపోయి.. ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా మారేదన్నారు.
"ఇలాంటి ఘటనలు చాలా అరుదు. కానీ ప్రతి ఒక్కరికి జరిగే అవకాశముంది. ఎంత నీరు తాగితే.. దానికి తగ్గట్టు మూత్రాశయ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అయితే దాని గరిష్ఠ పరిమితి 450 నుంచి 500 మిల్లీలీటర్లు మాత్రమే. అంతకు మించితే మూత్రాశయం పగిలిపోవొచ్చు. కాబట్టి తరచూ మూత్ర విసర్జన చేయండి" అని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దుశ్చర్య.. వాహనాలకు నిప్పు