మాస్కులు ధరించడం సహా కొవిడ్ నిబంధనల్ని తుచ తప్పకుండా పాటించాలని దేశ ప్రజలకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సూచించారు. అలా చేయకుండా, కరోనా ఉద్ధృతి పెరిగితే మాత్రం దేశవ్యాప్తంగా మరోమారు లాక్‌డౌన్ తప్పదని హెచ్చరించారు. మహమ్మారిలను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన జాతీయ సమన్వయ కమిటీ సమావేశంలో ఇమ్రాన్ శుక్రవారం ప్రసంగించారు.
భౌతిక దూరం నిబంధనల అమలులో పోలీసులకు సైన్యం సహకరిస్తుందని తెలిపారు. కరోనా విశ్వరూపం వల్ల భారత్‌లో లాక్‌డౌన్‌లు విధిస్తున్నారని, ఆ పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలంటే నిబంధనల్ని పాటించడమొక్కటే ఉత్తమ పరిష్కారమని వ్యాఖ్యానించారు.
షాబాజ్ షరీఫ్ జైలు నుంచి విడుదల
రెండు అవినీతి కేసుల్లో 8 నెలలుగా కారాగారంలో ఉన్న పాకిస్థాన్ ప్రతిపక్ష నేత, పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన ఒకరోజు తర్వాత ఆయన కోట్ లఖ్‌పత్ జైలు నుంచి బయటికి వచ్చారు. మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ సోదరుడైన షాబాజ్‌కు స్వాగతం పలికేందుకు పీఎంల్ మద్దతుదారులు పలువురు జైలు వద్దకు వచ్చారు.
ఇదీ చూడండి: కొవిడ్‌పై పోరులో భారత్‌కు సాయం చేస్తాం: చైనా