కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనే వాదనకు క్రమంగా బలం చేకూరుతోంది. వుహాన్(చైనా)లోని రెండు ఆసుపత్రుల్లో గాలిలోని తుంపర్లలోనూ వైరస్ జాడలను గుర్తించారంటూ నేచర్ పత్రికలో కథనం ప్రచురితమైంది. శాస్త్రవేత్తలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో వుహాన్‌లోని రెన్మిన్ ఆసుపత్రితోపాటు కొవిడ్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారిని క్వారంటైన్ చేసిన తాత్కాలిక కేంద్రం నుంచి గాలి నమూనాలను సేకరించారు. అలాగే ఒక నివాస సముదాయం, మరో సూపర్ మార్కెట్, రెండు డిపార్ట్‌మెంటల్ స్టోర్ల నుంచీ గాలి నమూనాలను తీసుకున్నారు. విశ్లేషణ తర్వాత... ఆసుపత్రుల గాలి నమూనాల్లో మినహా మిగిలిన ప్రదేశాలు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రుల్లో జనం గుమిగూడే ప్రాంతాలు, ఐసోలేషన్ వార్డులు, కొవిడ్ బాధితుల గదులు, గాలి సరిగా సోకని మరుగుదొడ్లలోని గాలిలో అత్యల్పస్థాయిలోనే వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇవి మనుషులకు ఎంతవరకు హాని చేస్తాయన్నది ఇంకా వెల్లడికాలేదన్నారు.
క్యాన్సర్ తరహా చికిత్సతో ప్రయోజనం!
క్యాన్సర్ తరహాలో కొవిడ్‌కి దీర్ఘకాలిక చికిత్సా విధానం అనుసరించాలని ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నానోమెడిసిన్ నిపుణుడు కొతారెలస్ పేర్కొన్నారు. కరోనా వైరస్ భవిష్యత్తులో మరింతగా వ్యాప్తి చెందే అవకాశాలపై విస్తృత పరిశోధనలు అవసరమన్నారు. ఈ మేరకు ఆయన రాసిన వ్యాసం ‘నేచర్ నానోటెక్నాలజీ’ జర్నల్‌లో ‘నానోస్కేల్ నైట్స్ ఆఫ్ కొవిడ్-19’ పేరిట ప్రచురితమైంది. ‘‘ముందస్తు గుర్తింపు, పర్యవేక్షణ, లక్ష్యం సాధించడం.. వంటి మూడు సూత్రాలు క్యాన్సర్ చికిత్సలో కీలకం. ముందస్తు పరీక్షలతో చాలావరకు క్యాన్సర్‌ను గుర్తించగలుగుతున్నాం. ఇలాగే వ్యక్తిగతంగా, బృందాలుగా విస్తృత పరీక్షలు చేసి కొవిడ్ బారిన పడిన వారిని గుర్తించాలి. బాధితుల ఆరోగ్యం క్షీణించకముందే గుర్తించి పర్యవేక్షిస్తుంటే చికిత్స సులువవుతుంది. ప్రస్తుతానికి కొవిడ్‌కు ఎలాంటి టీకా, చికిత్స విధానం లేనప్పటికీ.. బాధితుల్లో వ్యాధి లక్షణాలను తగ్గించగలిగినా సమాజంలో అలజడి సద్దుమణుగుతుంది. ఇక క్యాన్సర్ చికిత్సలో వాడే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కేవలం క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలోనే సమర్థంగా పనిచేస్తాయి’ అని అందులో వివరించారు.
ఇదీ చూడండి:- ఐరోపాలో శాంతిస్తున్న కరోనా.. ఫ్రాన్స్‌లో తగ్గిన మరణాలు