Lata Mangeshkar News: దిగ్గజ గాయని లతా మంగేష్కర్(92) తుదిశ్వాస విడిచారు. తన పాటలతో విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది సంగీత ప్రియుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు ఆమెకు నివాళులు అర్పించారు.
'సంగీతం విశ్వభాష'కు లతా జీవం..
Lata Mangeshkar dead: లతా మంగేష్కర్ మృతి పట్ల శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స నివాళులు అర్పించారు. 'సంగీతం విశ్వభాష' అన్న నానుడికి జీవం పోశారని కొనియాడారు.
'తన మధురమైన స్వరంతో కోట్లాది సంగీత ప్రియులను పులకింపజేసిన లతా మంగేష్కర్‌కు నివాళులు' అని ట్వీట్ చేశారు.
ఎంతో విచారకరం..
RIP Lata Mangeshkar: 'లతా మంగేష్కర్ మరణం ఎంతో విచారకరం. ఆమె కుటుంబసభ్యులకు, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. పాటల రూపంలో ఎప్పటికీ లతా మనతో ఉంటారు' అని శ్రీలంక ప్రధాని మహీందా రాజపక్స ట్వీట్ చేశారు.
నైటింగేల్ ఆఫ్ సబ్ కాంటినెంట్..
లతా మంగేష్కర్‌కు సంతాపం ప్రకటించింది పాకిస్థాన్. ఈ మేరకు లతా మంగేష్కర్‌ను 'నైటింగేల్ ఆఫ్ సబ్ కాంటినెంట్'గా అభివర్ణించింది.
'ప్రపంచ సంగీత చరిత్రలో ఇదొక చీకటి దినం' అని పాకిస్థాన్‌లోని రాజకీయనేతలు, కళాకారులు, క్రికెటర్లు, జర్నలిస్టులు విచారం వ్యక్తం చేశారు.
సంగీత మహారాణికి నివాళులు..
లతా మంగేష్కర్ మృతి పట్ల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లత మరణం ఉపఖండంలోని సంగీత ప్రియులకు తీరని లోటు అన్నారు. లతా 'సంగీతానికి మహారాణి' అని అభివర్ణించారు షేక్ హసీనా. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ సైతం లతా మంగేష్కర్‌కు సంతాపం తెలిపారు.
ఎన్నో బంధాలను వారధి..
లతా మంగేష్కర్‌కు సంతాపం ప్రకటించారు యూఏఈలోని భారత సంతతి ప్రజలు. లతా మరణంతో కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు.
"గతేడాది నా తండ్రి చనిపోయినప్పుడు.. నేను లతాజీ పాటలు వింటూ నా తండ్రిని గుర్తుచేసుకుని ఏడ్చేవాడ్ని. ఎన్నో బంధాలకు ఆమె పాటలు ఓ వారధి."
-- దుబాయ్‌లోని ఓ భారతీయుడి ఆవేదన
తన స్వరంతో ఆమె సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పలువురు అభిప్రాయపడ్డారు.
నేపాల్ ప్రధాని నివాళి..
నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించారు.
"లతా మరణం నాకు బాధ కలిగించింది. నేపాలీలో లతా మంగేష్కర్ అనేక గీతాలు ఆలపించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా." అని దేవ్బా ట్వీట్ చేశారు.
ఉపఖండం గొప్ప సింగర్‌ను కోల్పోయింది..
లతా మంగేష్కర్ మరణంతో ఉపఖండం గొప్ప సింగర్‌ను కోల్పోయిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ఆమె గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు ఇమ్రాన్ ఖాన్.
లతా మంగేష్కర్‌పై ప్రత్యేక కథనాలు మీకోసం..
లతా మంగేష్కర్ పాటల పూదోటలో అద్భుతాలెన్నో..
లతా మంగేష్కర్ పాడిన తెలుగు పాటలు ఇవే