ప్రపంచంపై కరోనా ప్రభావం గురించి ఒక్కమాటలో చెప్పలేం. వైరస్ కారణంగా ప్రజలే కాదు ఆహారం లేక జంతువులూ విలవిల్లాడిపోతున్నాయి. పెంపుడు జంతువులు సైతం ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి పోషణ ఇబ్బందిగా మారడం వల్ల తాము ఇష్టంగా పెంచుకున్న జంతువులను జంతు ప్రదర్శనశాలకు అప్పగిస్తున్నారు ఇరాన్‌లోని ప్రజలు. ఈ నేపథ్యంలో అల్లారుముద్దుగా పెంచుకున్న తన సింహాన్ని కూడా 'జూ'లో అప్పగించాడు మహ్మద్ అబ్దుల్ హమీద్. అయితే అది లేకుండా ఉండలేక, దాన్ని తీసుకెళ్లి పెంచలేక అవస్థలు పడుతున్నాడు.
సింహం కథ..
మహ్మద్ అబ్దుల్ హమీద్ ఇరాక్‌లోని దిహుక్ ప్రాంతానికి చెందినవాడు. ఎవరైనా పెంపుడు జంతువులు అంటే కుక్కనో, పిల్లినో పెంచుకుంటారు. కానీ హమీద్.. 'సుల్తాన్' అనే ఆఫ్రికన్ మగ సింహాన్ని చిన్న పిల్లగా ఉన్నప్పుడే కొనుగోలు చేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ప్రస్తుతం ఆ సుల్తాన్‌కు 11 నెలలు. అయితే మహమ్మారి కరోనా కారణంగా దాని పోషణ, రక్షణ హామీద్‌కు కష్టమైంది.
అసాధ్యమనిపించి..
దేశంలో లాక్డౌన్ విధించడం వల్ల నగరాలన్ని నిర్బంధంలోకి వెళ్లాయి. దుకాణాలు మూసివేశారు. నిత్యవసరాలు దొరకడం కూడా కష్టమైంది. దీంతో సింహానికి ఆహారం అందించడం, భద్రత కల్పించడం అసాధ్యమని భావించి.. సింహాన్ని జూకు అప్పగించాడు హమీద్.
"ఇది ఆఫ్రికన్ మగ సింహం. వైరస్ ప్రభావం వల్ల నా కుటుంబానికి, సింహానికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని సూల్తాన్‌ను ఇక్కడకు (జూ) తీసుకొచ్చాను. అయినప్పటికీ సూల్తాన్‌ను చూడటానికి వారానికి రెండుసార్లు జూకు వస్తాను. సుల్తాన్ నన్ను గుర్తుపట్టి ఎంతో ప్రేమగా చూస్తోంది."
-మహ్మద్ అబ్దుల్ హమీద్
జంతువుల శిక్షుడు..
దిహుక్ 'జూ'లో శిక్షకుడు బిలాల్ షమీ. ఆయన హమీద్ సింహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
"ముఖ్యంగా సింహాలకు జ్ఞాపకశక్తి మరీ తక్కువ ఉంటుంది. ఈ సింహం చుట్టూ ఉన్న కోతులు, ఉడతలు వంటి జంతువులను చూసి జూను కొత్త ఇల్లులా భావిస్తోంది. కరోనా నివారణ చర్యలు కారణంగా అనేకమంది తమ పెంపుడు జంతువులను జూకు తీసుకొచ్చారు. అయితే ఒక్క సింహాన్ని తప్ప వారందర్ని తిరిగి పంపేశారు అధికారులు. సింహం ఆకలితో ఉన్నప్పుడు హమీద్ ఇంటి వద్ద లేకపోతే అతని కుటుంబ సభ్యుల మీద దాడి చేసే ప్రమాదం ఉందనే కారణంతో తీసుకున్నారు." అని షమీ తెలిపారు.
ఇదీ చూడండి: భారత్-నేపాల్ కాలాపానీ రగడపై చైనా కీలక వ్యాఖ్యలు