ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. ఈ రాకెట్ దాడిలో ఇరాన్ నిఘా విభాగాధిపతి సులేమానీతో పాటు ఇరాక్ కతైబ్ హిజ్బుల్లా డిప్యూటీ కమాండర్ అబు మహదీ అల్ ముహందీస్ మరణించారు. అయితే ఈ ఇరువురు నేతలను అగ్రరాజ్యం ఎందుకు మట్టుబెట్టిందో తెలుసుకుందాం.
ఖాసీం సులేమానీ ఎవరు?
1957 మార్చి 11న జన్మించిన ఖాసీం సులేమానీ..1980 ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో కీలకంగా వ్యవహరించారు. అనంతరం 'రివల్యూషనరీ గాడ్స్ ఎలైట్ కుద్స్ ఫోర్స్'కు కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2003లోనే సులేమానీని హత్య చేసేందుకు అమెరికా బలగాలు ప్రయత్నించాయి. అప్పటి నుంచి ఆయన పేరు బాగా ప్రాచుర్యం పొందింది. 2012లో సిరియాలో చెలరేగిన అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి అండగా నిలిచి ఆ దేశాధ్యక్షుడు బషర్ అసద్‌కు అనూకూలంగా పలు హింసాత్మక ఘటనలు కూడా చేపట్టారు రివల్యూషనరీ ఫోర్స్ బాస్.
చావు నుంచి తప్పించుకున్నారు...
సులేమానీ గతంలో చాలాసార్లు చావు నుంచి తప్పించుకున్నారు. 2006లో వాయువ్య ఇరాన్లో విమానం కూలిపోయిన ఘటనలో పలువురు మిలిటరీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు సులేమానీ కూడా మరణించారని అప్పట్లో వార్తలొచ్చాయి. అలాగే 2012లో డమస్కస్‌లో జరిగిన బాంబుదాడి, 2015లో సిరియా అలెప్పో దాడిలో సులేమానీ మరణించారని బాగా ప్రచారం అయింది. అయితే బాగ్దాద్‌లోని అమెరికా దౌత్యకార్యాలయంపై దాడికి ప్రతిగా తాజాగా సులేమానీని మట్టుబెట్టింది అగ్రరాజ్యం.
అబు మహదీ అల్ ముహందిస్...
కతైబ్ హిజ్బుల్లా డిప్యూటీ కమాండర్ అయిన ముహందిస్.. ఇరాక్‌లో ఇరాన్ మద్దతున్న తిరుగుబాటు సంస్థ 'పాపులర్ మొబిలైజేషన్ కమిటీ'ని ముందుండి నడిపించారు. ఈయనకు.. ఇస్లామిక్ రిల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)తో మంచి సంబంధాలున్నాయి. సులేమానీతో కలిసి ఇరాక్ అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్ పరిపాలనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాగే అమెరికా ఆజ్ఞలను కూడా పాటించేవారు కాదు.
1983లో కువైట్‌లోని అమెరికా, ఫ్రెంచ్ దౌత్య కార్యాలయాలపై బాంబుదాడి ఘటనలో ముహందిస్ నిందితుడిగా ఉన్నారు. అదే కేసులో కువైట్ ఆయనకు మరణశిక్ష విధించింది. కువైట్ ఎమిర్(రాజు) పై జరిగిన హత్యాయత్నంలో ముహందిస్కు సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఉత్తర ఇరాక్‌లో గతవారం జరిగిన రాకెట్ దాడిలో అమెరికా కాంట్రాక్టర్ ఒకరు చనిపోయారు. ఈ ఘటనకు కతైబ్ హిజ్బుల్లానే కారణమని అమెరికా ఆరోపించింది. తాజాగా బాగ్దాదీ విమానాశ్రయంలో సులేమానీతో పాటు ముహందిస్పై బాంబుదాడి చేసింది.