అమెరికాతో 'అణ్వాయుధ' చర్చలు విఫలమైన వేళ... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురువారం సమావేశమయ్యారు. వ్లాదివోస్తోక్ నగరంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
అణునిరాయుధీకరణపై ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు పుతిన్‌తో, కిమ్ భేటీ కావడం.., విస్తృత చర్చలు చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కిమ్‌తో కలిసి అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు రష్యా అధ్యక్షుడు పావులు కదుపుతున్నారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తలు తగ్గించేందుకు మద్దతుగా నిలుస్తామని పుతిన్ స్పష్టం చేశారు. ఇరుదేశాల దౌత్య, ఆర్థిక సంబంధాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ఉత్తర కొరియా స్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ కాలం నుంచి ఆ దేశానికి రష్యా మిత్ర దేశంగా ఉంది. ఇప్పుడు తమ భేటీతో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడుతుందని కిమ్ అన్నారు.
ఇదీ విషయం..
అణు కార్యక్రమాల నేపథ్యంలో ఉత్తర కొరియా అమెరికా ఆంక్షలు విధిస్తోంది. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు కిమ్. తాము ఒంటరిగా లేమని అమెరికాకు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మిత్ర దేశమైన చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుదలకు కృషి చేశారు. చైనా అధ్యక్షునితో భేటీ అయ్యారు. తాజాగా రష్యా అధ్యక్షునితో సమావేశమయ్యారు.
ఇదీ చూడండి: నిస్సాన్ మాజీ సీఈఓ కార్లోస్‌కు బెయిల్