ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి (Corona virus) కాస్త శాంతించినట్లు కనిపిస్తోంది. కొత్తగా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఒకట్రెండు దేశాల్లో మినహా.. వైరస్ తీవ్రత కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇందుకు పలు దేశాలు ఆంక్షలు(Corona Restrictions) సడలిస్తుండటమే నిదర్శనం.
జపాన్‌లో అత్యవసర పరిస్థితి ఎత్తివేత..!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితి(coronavirus emergency) ఈ వారం చివరి నాటికి ఎత్తివేయనన్నట్లు జపాన్ ప్రభుత్వం (Japan emergency news) ప్రకటించింది. 'ఈ గురువారం అత్యవసర పరిస్థితి ముగిసిపోతుంది. రోజువారీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు వైరస్ ఆంక్షలు క్రమంగా తొలగిపోనున్నాయి. మరిన్ని కొవిడ్-19 చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. భవిష్యత్తులో మళ్లీ వైరస్ విజృంభించే ప్రమాదం ఉన్న క్రమంలో వ్యాక్సినేషన్‌ను(Corona vaccination) కొనసాగిస్తాం. వ్యాక్సిన్ పాస్‌పోర్ట్, వైరస్ పరీక్షలకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.' అని ప్రధానమంత్రి యొషిహిదే సుగా తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జపాన్‌లో అత్యవసర పరిస్థితి(Japan emergency news) విధించారు. ఆ తర్వాత పలుమార్లు పొడగిస్తూ వచ్చారు.
శ్రీలంకలో అక్టోబర్ 1 నుంచి..
దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఆరోగ్య అధికారులు భావిస్తున్న క్రమంలో అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను(Nationwide lockdown) ఎత్తివేసేందుకు ప్రణాళికలు చేస్తోంది శ్రీలంక. అలాగే.. వివిధ ప్రాంతాల్లోని కర్ఫ్యూను సైతం తొలగించనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. ఆగస్టు 20న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది శ్రీలంక. ఏప్రిల్ మధ్య నుంచి మూడో దశ ఉద్ధృతి మొదలైన క్రమంలో మూడుసార్లు లాక్డౌన్ పొడగించారు. లాక్డౌన్ ఎత్తివేతలో భాగంగానే.. అక్టోబర్ 1 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయాలకు హాజరుకావాలని ఆదేశించారు.
లాక్డౌన్ ఎత్తివేతకు రాష్ట్రాలపై ఒత్తిడి..
కరోనా వ్యాప్తి తగ్గుముఖం సహా.. ఆయా రాష్ట్రాలకు అందిస్తున్న సాయాన్ని నిలిపివేసే ప్రణాళికల్లో భాగంగా కొవిడ్ లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వ్యాక్సినేషన్ బెంచ్‌మార్క్‌ను చేరుకున్న రెండు వారాల తర్వాత.. పనిదినాలు కోల్పోయిన ఉద్యోగులకు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తామని ప్రకటించింది. మరోవైపు.. లాక్డౌన్ ఎత్తివేయాలని జులైలోనే నేతలు అంగీకరించినప్పటికీ.. డెల్టా వేరియంట్(Delta Variant) విజృంభణతో పొడిగించాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశంలో 53 శాతం మందికి పూర్తిస్థాయిలో టీకా అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 80 శాతం మందికి టీకా అందించటం బెంచ్‌మార్క్‌గా పెట్టుకుంది ప్రభుత్వం.
పాక్‌లో చిన్న పిల్లలకు వ్యాక్సిన్
కొవిడ్-19 మహమ్మారి నుంచి పిల్లలను కాపాడటమే లక్ష్యంగా 12 ఏళ్లు ఆపైబడిన వయసు పిల్లలకు టీకా పంపిణీ(vaccine for children) ప్రారంభిస్తామని పాకిస్థాన్ ప్రణాళిక శాఖ మంత్రి అసద్ ఉమర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టిన క్రమంలో ఈ ప్రకటన చేశారు ఉమర్. పాఠశాలల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామని ట్వీట్ చేసిన ఉమర్.. ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే విషయాన్ని చెప్పలేదు.
ఇదీ చూడండి: కొవిడ్ నుంచి కోలుకున్నా.. రుచీపచీ లేని జీవితం!