జైల్లో మూడు వారాలుగా నిరహార దీక్ష చేపట్టిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని ఆసుపత్రికి తరలించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ జైలు అధికారులు సోమవారం తెలిపారు. నావల్నీ మరణం అంచుల్లోకి జారిపోయారని ఆయన వ్యక్తిగత వైద్యుడు అషిఖిమిన్ చెప్పిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
వ్లాదిమిర్ నగరంలోని ఖైదీల ఆసుపత్రికి నావల్నీని తరలిస్తామని రష్యా జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని పేర్కొన్నారు. విటమిన్ సప్లిమెంట్లను తీసుకునేందుకు నావల్నీ అంగీకరించారని చెప్పారు.
2014లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలను నావల్నీ ఎదుర్కొంటున్నారు. గతేడాది ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఈ జనవరి 17న జర్మనీ నుంచి స్వదేశానికి వచ్చిన నావల్నీని విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరిలో కోర్టు ముందు హాజరుపరిచిన అనంతరం నావల్నీని జైలుకు తరలించారు. తాజాగా అక్కడి జైలు అధికారులు వేధిస్తున్నారనే ఆరోపణలతో నావల్నీ నిరాహార దీక్షకు దిగారు.
ఇదీ చూడండి: జైల్లోనే నిరాహార దీక్షకు దిగిన రష్యా విపక్షనేత!