చంద్రుడి మీదకి ఇజ్రాయెల్ తొలిసారి ప్రయోగించిన 'బెరేషీట్' అంతరిక్ష నౌక సెల్ఫీ తీసి భూమికి పంపింది. ఈ చిత్రంలో బెరేషీట్ వెనుకనున్న భాగాలతో పాటు సుదూరంగా భూమి స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని ఎహుద్లో ఉన్న అంతరిక్ష కేంద్రానికి దీన్ని పంపింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ధ్రువీకరించారు. భూమికి 37,600 కిలోమీటర్ల దూరంలో ఈ నౌక ఉన్నట్లు తెలిపారు. ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో 'చిన్నదేశం పెద్ద కలలు' అని రాసిన ఇజ్రాయెల్ జాతీయ పతాకం కూడా ఉంది.
ఎన్జీఓ స్పేస్ ఐఎల్ సంస్థ, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ మానవ రహిత బెరేషీట్ అంతరిక్ష నౌక ప్రయోగాన్ని నిర్వహించాయి. ఫ్లోరిడాలోని కేప్ కనావ్రాల్ ప్రాంతం నుంచి ఫిబ్రవరి 22న ఈ అంతరిక్షనౌకను పంపారు. చంద్రుని పుట్టుక రహస్యం తెలుసుకునేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. అమెరికా కేంద్రంగా ఉన్న స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన 'ఫాల్కన్ 9' రాకెట్లో 585 కిలోల ఈ అంతరిక్ష నౌకను చంద్రుడి వద్దకు పంపారు. దీని అంతరిక్ష ప్రయాణం 7 వారాల పాటు సాగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న చంద్రున్ని చేరనుంది.
ఎందుకీ ప్రయోగం
చంద్రున్ని చేరడమే ఇజ్రాయెల్ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అయితే చంద్రుడి అయస్కాంత క్షేత్రాన్ని కొలిచే కొన్ని రకాల శాస్త్రీయ ఉపకరణాలను సైతం ఇందులో పొందుపరిచారు.
వీటితో పాటు డిజిటల్ బైబిల్, ఇజ్రాయెల్ పాటలు, ఇజ్రాయెల్ జాతీయ జెండాల టైం క్యాప్సుల్‌ను ఉంచారు.
ఇప్పటి వరకు చంద్రున్ని చేరిన దేశాలు
చాలా ఏళ్ల క్రితం రష్యా, అమెరికాకు చెందిన అంతరిక్షనౌకలు మాత్రమే 3,84,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రున్ని చేరాయి. ఆ తర్వాత చైనాకు చెందిన అంతరిక్షనౌక ఇటీవల విజయవంతంగా చంద్రుడిపై ఉపగ్రహాన్ని పంపి ఈ వరుసలో మూడో స్థానంలో నిలిచింది. తాజా ప్రయోగంతో ఇజ్రాయెల్ నాలుగో స్థానంలో నిలువనుంది.
భారత్ కూడా 'చంద్రయాన్-2'తో చంద్రుడిపైకి అంతరిక్ష నౌకను పంపాలని భావిస్తోంది. ఈ ప్రయోగంతో ఒక రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై దింపి అక్కడి వాతావరణ సమాచారాన్ని సేకరించాలనేదే 'చంద్రయాన్-2' ఉద్దేశం. ఇదే వరుసలో జపాన్ కూడా 'స్లిమ్' అనే తేలిక పాటి అంతరిక్ష నౌకను పంపాలని భావిస్తోంది. చంద్రుడిపై అగ్ని పర్వతాల అధ్యయనానికి ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.
అమెరికా మరో సారి!
అమెరికా 1972 తర్వాత మళ్లీ చంద్రుడి పైకి రాకెట్లను పంపలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గదర్శకాలతో మరోసారి చంద్రుడిపైకి రాకెట్ పంపనున్నట్లు నాసా 2017లో వెల్లడించింది.