ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఊహించని అనుభవం ఎదురైంది. అశ్కెలోన్ నగరంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనపై దాడి జరగనున్నట్లు హెచ్చరికలు వచ్చాయి. పాలస్తీనా అధీనంలోని గాజా నుంచి రాకెట్ ద్వారా దాడి చేసే అవకాశం ఉందని భద్రత దళాలకు సమాచారం అందింది. దీంతో భద్రత దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రచార సమయంలో వేదికపై ఉన్న ఆయన్ను హుటాహుటిన సురక్షిత స్థావరానికి తరలించాయి. ప్రధాని ఎన్నికల ప్రచారం జరుగుతున్న ప్రదేశమైన అశ్కెలోన్... గాజాకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
మరోవైపు రాకెట్ ప్రయోగం జరిగినట్లు ఇజ్రాయెల్ అధికారులు స్పష్టం చేశారు. అయితే వాటిని దేశ క్షిపణి రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఈ రాకెట్ దాడిలో ఎవరూ గాయపడలేదు. ఇప్పటివరకు ఈ ఘటనపై ఏ పాలస్తీనా గ్రూపు బాధ్యత వహించలేదు.
ఇదీ చదవండి: నమో నమామి.. తమిళనాడులో మోదీకి ఆలయం